శ్రీదేవికిచ్చిన మాట కోసం 2 సినిమాలు

Wed Dec 19 2018 07:00:01 GMT+0530 (IST)

తలాగా అభిమానులతో ముద్దుగా పిలిపించుకునే అజిత్ కొత్త సినిమా విశ్వాసం పొంగల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మన దగ్గర సంక్రాంతికి దిగ్గజాల పోటీ ఉండటంతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ వచ్చే ఛాన్స్ లేదు కానీ అక్కడ మాత్రం దీని ఫీవర్ ఓ రేంజ్ లో ఉంది. దీని తర్వాత అజిత్ హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ హిందీలో చేసిన రోల్ ఇక్కడ అజిత్ చేయబోతున్నాడు. ఇదే తెలుగులో కూడా వస్తుంది.ఈ సినిమా చేయడానికి ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. ఇంగ్లీష్ వింగ్లిష్ లో ఒక చిన్న క్యామియో చేస్తున్నప్పుడు అజిత్ తో శ్రీదేవి ఒక మాట తీసుకుందట. తన భర్త బోనీ కపూర్ ప్రొడక్షన్ ని సౌత్ లో ఎప్పుడైనా అజిత్ తోనే ప్రారంభించాలని. సరే అని చెప్పిన అజిత్ అప్పటికప్పుడు ఒకటి కాదు రెండు చేద్దామని మాట ఇచ్చాడు. ఆ సమయంలోనే పింక్ రావడం హిట్ కావడం అజిత్ స్వయంగా శ్రీదేవితో రీమేక్ గురించి చర్చలు చేయడం జరిగింది. అయితే విధి రాత ఇంకోలా ఉంది. శ్రీదేవి అకాల మరణం అజిత్ కు షాక్ మిగిల్చింది. అయినా శ్రీదేవికి ఇచ్చిన మాట కోసం వెంటనే పింక్ రీమేక్ ను లైన్ లో పెట్టేసాడు.

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టిన ఈ మూవీకి ఏకె 59 అనే టైటిల్ ఫిక్స్ చేసారు.ఇదంతా బోనీ స్వయంగా షేర్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది మే 1 రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసారు. అంతే కాదు ఇది పూర్తవ్వగానే ఇచ్చిన మాట ప్రకారం అజిత్ మరో సినిమా కూడా బోనీ కపూర్ నిర్మాణంలో చేస్తాడు. దాని రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ 20-2020 కి డిసైడ్ చేసారు. మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏకే 59కు దర్శకుడు వినోత్. కార్తీ ఖాకీతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. ఇప్పుడీ సినిమాతో పెద్ద ఛాన్స్ కొట్టాడు. ఈ రెండు పూర్తయ్యాక బోనీ కపూర్ తెలుగులో అడుగుపెట్టే ప్రణాళికలు వేస్తున్నాడు.