పెళ్లిపై రజనీ కూతురు షాకింగ్ కామెంట్స్

Wed Jan 19 2022 16:01:06 GMT+0530 (India Standard Time)

Aishwarya Rajinikanth Shocking Comments On Marriage

తమిళ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాదిలో ఇది హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న  నాగార్జున తనయుడు హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతతో విడిపోతున్నానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ వార్త ఇంకా మర్చిపోకముందే కోలీవుడ్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నానని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.18 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం వీరు విడిపోవడం ఏంటని హాట్ చర్చ మొదలైంది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని అవి తాజాగా తారా స్థాయికి చేరాయని ఆకారణంగానే వీరు ఇప్పుడు విడిపోతున్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతే కాకుండా ఇటీవల ఐశ్వర్య సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఆసక్తికరమైన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య వివాహ వ్యవస్థని ఉద్దేశిస్తూ ఆసక్తికరంగా ఓ పోస్ట్ ని షేర్ చేశారు.

`పెళ్లి అనేది ఒకరి మానసిక బరువులను మరొకరు మోయడమే. నా విషయంలో అది మరింత నిజం. అర్థం చేసుకునే గుణమే మిగతా అన్నిటి కన్నా మిన్న. కలిసి ఉండటానికి స్నేహమే ప్రధాన కారణం అవుతుంది. ఇల్లే ఎప్పటికీ మన సొంత స్థలం` అని ఐశ్వర్య ఆసక్తికరంగా పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంటే గత కొంత కాలంగా ధనుష్ - ఐశ్వర్య భారంగానే తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తున్నారని ఐశ్వర్య మాటల్లో ధ్వనించింది.

వీరిద్దరు ఏనాడో విడిపోయేవారని రజనీ కారణంగానే వీరు కలిసి వున్నట్టుగా నటించారని కోలీవుడ్ లో కొంత మంది చెప్పుకుంటున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రజనీ పరిస్థితి ఏంటని కూడా చర్చ జరుగుతోంది. గతంలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య.. బిజినెస్ మెన్ అశ్విన్ కుమార్ ని వివాహం చేసుకుని ఓ కుమారుడు పుట్టిన తరువాత తనతో విడిపోయి మరో వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పడు చెల్లెలు తరహాలోనే ఐశ్వర్య కూడా ధనుష్ కి విడాకులు ఇవ్వడంతో రజనీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారట. తలైవా రజనీ పరిస్థితి ఏంటని ఇద్దరు కూతుళ్లు విడాకులతో షాకివ్వడంతో రజనీ ఎంత వేదనకు గురవుతున్నారోనని కలవరపడుతున్నారట. అందుకే రజనీ స్టే స్ట్రాంగ్ అంటూ నెట్టింట హ్యాష్ ట్యాగ్ లతో ప్రచారం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.