Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'అహింస'

By:  Tupaki Desk   |   2 Jun 2023 4:46 PM GMT
మూవీ రివ్యూ : అహింస
X
మూవీ రివ్యూ : 'అహింస'

నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి-గీతిక-సదా-రజత్ బేడి-కమల్ కామరాజు తదితరులు

సంగీతం: ఆర్పీ పట్నాయక్

నేపథ్య సంగీతం: అనూప్ రూబెన్స్

ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి

నిర్మాతలు: సురేష్ బాబు-జెమిని కిరణ్

రచన-దర్శకత్వం: తేజ

తెలుగు వెండి తెరపైకి కొత్త వారసుడొచ్చాడు. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు అభిరామ్ 'అహింస' సినిమాతో అరంగేట్రం చేశాడు. కొత్త వాళ్లను పరిచయం చేయడంలో తనదైన శైలిని చూపించే సీనియర్ దర్శకుడు తేజ రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రఘు (దగ్గుబాటి అభిరామ్).. అహల్య (గీతిక) ఒక పల్లెటూరికి చెందిన బావా మరదళ్లు. వీళ్లిద్దరికీ పెళ్లి చేయాలని చిన్నప్పుడే నిర్ణయం జరుగుతుంది. ఎప్పుడూ తన వెంట పడే అహల్యను రఘు పట్టించుకోనట్లు ఉంటాడు కానీ.. ఆమె అంటే అతడికి చాలా ఇష్టం. కొన్ని రోజుల్లో వీరి పెళ్లి జరగాల్సిన సమయంలో గీతికపై ఇద్దరు సిటీ కుర్రాళ్లు అత్యాచారం చేస్తారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో అహల్య ఆసుపత్రి పాలవుతుంది. ఆమెను ఓవైపు కాపాడుకుంటూనే తనపై అత్యాచారం చేసిన కుర్రాళ్లపై కేసు పెట్టి పోరాడతాడు రఘు. కానీ సాక్ష్యాలను తారు మారు చేసి కేసు నీరుగారిపోయేలా చేస్తాడు నిందితుల తండ్రి ధనలక్ష్మీ దుష్యంత్ రావు (రజత్ బేడి). మరి ఈ స్థితిలో అహల్యకు న్యాయం జరిగిందా లేదా.. ఆమెను రఘు ఎలా కాపాడుకున్నాడు.. ఈ ప్రశ్నలకు సమాధానం తెర మీదే తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఒక 'చిత్రం'.. ఒక 'నువ్వు నేను'.. ఒక 'జయం'.. ఈ మూడు చిత్రాలు రెండు దశాబ్దాల కిందట యవ్వనంలో ఉన్న ప్రేక్షకులను మామూలుగా ఊపేయలేదు. హీరో హీరోయిన్లెవరో చూడకుండా.. కేవలం 'తేజ' అనే పేరు చూసి థియేటర్లకు పరుగులు పెట్టేలా చేసిన చిత్రాలివి. అలాంటి ఫాలోయింగ్ సంపాదించిన అరుదైన దర్శకుల్లో ఒకరు తేజ. కానీ పై మూడు చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన తేజ.. తర్వాత ఆ ట్రెండులోనే చిక్కుకుపోవడమే విచిత్రం. ముందు తీసిన సినిమాలు కొత్తగా అనిపించి ప్రేక్షకులను మెప్పించాయి కదా అని.. తర్వాత తర్వాత అవే తీస్తూ ఉంటే మొహం మొత్తడం ఖాయం. తేజ విషయంలో అదే జరిగింది. తర్వాతి కాలంలో ఆయన ప్రేమకథ తీశాడంటే చాలు.. వామ్మో అనుకునే పరిస్థితి వచ్చింది. అన్ని ఎదురు దెబ్బల తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు తన 'మార్కు'.. పాత చింతకాయ పచ్చడి ప్రేమకథనే మళ్లీ వడ్డించాడు 'అహింస' రూపంలో. సినిమా మొదలైన దగ్గర్నుంచి 'ఔట్ డేటెడ్' ఫీల్ గుప్పుమని కొట్టే ఈ సినిమా.. ప్రేక్షకులకు పెద్ద హింసలాగే తయారైంది.

ఒక పేద అమ్మాయిని ఒక ధనవంతుడి కొడుకులిద్దరు రేప్ చేస్తారు. ఆ అమ్మాయి తరఫు వాళ్లు కోర్టుకెళ్తారు. ముందు పరిస్థితి చూస్తే నిందితులు అడ్డంగా దొరికిపోయినట్లు కనిపిస్తుంది. తీరా చూస్తే సాక్ష్యాలన్నీ తారుమారు అయిపోతాయి. కడుపు రగిలిపోయిన హీరో ఇందుకు వయొలెంట్ గా తయారై ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ లైన్ ఆధారంగా ఎన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి ఇండియన్ స్క్రీన్ మీద. కొన్ని సినిమాలు పూర్తిగా ఇదే కథ మీద నడిస్తే.. కొన్ని చిత్రాల్లో ఇలాంటివి ఉప కథలుగా ఉంటాయి. 90వ దశకంలో రచయితలు.. దర్శకులు విపరీతంగా వాడేసి అరగదీసేసిన ఈ లైన్ పట్టుకుని ఇప్పుడు రెండున్నర గంటలకు పైగా నిడివితో సినిమా తీసేశాడు తేజ. దగ్గుబాటి లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి కొత్తగా హీరో అవుతున్న అభిరాంను పెట్టి తేజ ఇలాంటి సినిమా తీయడం.. ఎంతో అనుభవజ్ఞుడైన సురేష్ బాబు దీనికి పెట్టుబడి పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయాలు. ట్రైలర్ చూసినపుడే ఔట్ టేడ్ ఫీల్ కలిగినా.. సినిమాలో తేజ ఏమైనా మ్యాజిక్ చేసి ఉంటాడేమో అనుకుంటే ఏ మెరుపులు లేకుండా సా...గిపోయి అతి సాధారణంగా ముగుస్తుంది 'అహింస'.

'అహింస' ఔట్ డేటెడ్ సినిమా అని ఎందుకు అనాల్సి వచ్చిందో ఒక సన్నివేశం ఉదాహరణగా చూద్దాం. హీరోయిన్ మృత్యువు అంచులో హాస్పిటల్ బెడ్డు మీద పడి ఉంటుంది. డాక్టర్ సిటీకి తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయకుంటే చాలా కష్టం అని చెప్పి వెళ్తుంది. ఆమె ఇలా చెబుతుండగానే హీరో అక్కడెక్కడో కొండ మీద ఏవో ఆకులన్నీ వేసి దంచి ఒక గుడ్డలో కట్టుకుని పరుగెత్తుకుని ఆసుపత్రికి వస్తాడు. హీరోయిన్ కు ఆక్సిజన్ సపోర్ట్ తీసేసి.. నోట్లో.. ముక్కులో.. కళ్లలో ఆకు పసరు పోసేస్తాడు. వెంటనే హీరోయిన్ ఫిట్స్ వచ్చినట్లు కొట్టుకుంటుంది. తర్వాత ఆమె హార్ట్ బీట్ ఆగిపోయినట్లు సంకేతాలు కనిపిస్తాయి. డాక్టర్ తన ప్రయత్నమేదో చేసి ఆమె చనిపోయిందని తీర్మానించి మార్చురీకి తీసుకెళ్లమంటుంది. అప్పుడు హీరో.. హీరోయిన్ నోట్లో నోరు పెట్టి ఊదుతాడు. కాసేపటికి ఆమె లేచి కూర్కుని ఏం బావా ఒక 'ఇంగ్లిష్' ఇవ్వవా అంటుంది. అదిస్తేనే లేచి కూర్చున్నావే అంటాడు హీరో. ఈ సన్నివేశం చూసి ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటారని తేజ అనుకున్నారేమో కానీ.. ఆ సీన్ చూస్తే మాత్రం వెటకారంగా నవ్వాలని మాత్రమే అనిపిస్తుంది.

హీరోయిన్ అత్యాచారానికి గురై ఆసుపత్రి బెడ్ మీద పడి ఉంటే.. ఇంకోవైపు ఒక లాయర్ సాయంతో హీరో కోర్టులో పోరాడే నేపథ్యంలోనే సగం సినిమా నడుస్తుంది 'అహింస'లో. విలన్ ఫ్యామిలీ డబ్బు సంచులు పట్టుకుని ఒక్కొక్కరిని కొనేయడం.. సాక్ష్యాలు తారు మారు చేయడం.. అడ్డొచ్చిన వాళ్లను లేపేయడం.. ఇదంతా కూడా చాలా పాత స్టయిల్లో డీల్ చేశారు. ఈ సన్నివేశాల్లో ఏదీ కొత్తది కాదు. కనీస ఆసక్తి రేకెత్తించేది కాదు. కోర్టులో న్యాయం దక్కనపుడు హీరో ఏం చేస్తాడు? రెబల్ అవుతాడు. తుపాకీ పట్టి తమకు అన్యాయం జరిగిన అందరికీ బుద్ధి చెప్పడం మొదలుపెడతాడు. ఇందులో కొత్తదనం ఏముంటుంది? ఇటు పోలీసులు.. అటు విలన్ బ్యాచ్.. వీరికి తోడు ఒక డెకాయిట్ గ్యాంగ్.. వీళ్లందరూ హీరో హీరోయిన్ల వెంట పడటం.. వాళ్లు తప్పించుకోవడానికి నానా పాట్లు పడటం.. ఇదంతా తేజ కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాల్లోనే చూసేశాం. బేసిగ్గా సున్నిత మనస్కుడు.. హింసకు దూరంగా ఉండే హీరో.. చివరికి అత్యంత హింసాత్మకంగా మారి అందరి ఆట కట్టించేలా పతాక సన్నివేశాలను తీర్చిదిద్దాడు తేజ. అడవిలో పోలీసులు.. రౌడీలను హీరో ఎదుర్కొనే ఎపిసోడ్లో తేజ కాస్త ఒకప్పటి తన పనితనం చూపించాడు కానీ.. అప్పటికే బాగా కిందికి పడిపోయిన 'అహింస' గ్రాఫ్ వీటి వల్లేమీ పైకి లేవదు. ఈ రోజుల్లో ఇలాంటి పాత చింతకాయ పచ్చడి కథాకథనాలతో సినిమా తీసి మెప్పించగలమని తేజ అండ్ టీం ఎలా నమ్మారన్నది అర్థం కాని విషయం.

నటీనటులు:

ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన కుర్రాడు హీరోగా అరంగేట్రం చేస్తే సినిమాలో ప్రేక్షకుల దృష్టి తన పెర్ఫామెన్స్ మీదే నిలుస్తుంది. ఐతే దర్శకుడు తేజ.. అభిరాంను ఒక హీరోలా ప్రెజెంట్ చేయడానికి చూడలేదు. ప్రేక్షకుల దృష్టి కూడా అతడి మీద ప్రత్యేకంగా నిలిచేలా తన పాత్రను డిజైన్ చేయలేదు. సినిమాలో మిగతా పాత్రల్లాగే ఇది ఒకటిగా అనిపిస్తుందంతే. అభిరాం స్క్రీన్ ప్రెజెన్స్.. బాడీ లాంగ్వేజ్ సోసోగా అనిపిస్తాయి. తన నటన పర్వాలేదు. అభిరామ్ లుక్స్ ఈ సినిమాలో చేసిన మామూలు కుర్రాడి పాత్రకు ఓకే కానీ.. అతను హీరోగా ఏమాత్రం రాణిస్తాడన్న సందేహం కలిగేలా ఉన్నాయి తన ఫీచర్స్. హీరోయిన్ గీతిక చూడ్డానికి బాగానే అనిపిస్తుంది. నటన ఓకే. విలన్ పాత్రకు రజత్ బేడి సరిపోయాడు. కానీ అతడి నటన అతిగా అనిపిస్తుంది. ఛటర్జీ అనే లాయర్ పాత్ర చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. సదా ఒక కీలక పాత్రలో రాణించింది. దేవీ ప్రసాద్.. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

చాలా ఏళ్ల పాటు సంగీతానికి దూరంగా ఉన్న ఆర్పీ పట్నాయక్.. 'అహింస'కు పాటలు అందించాడు. 2000 ప్రాంతంలో ఆర్పీ అందించిన పాటలు ఇప్పుడు విన్నా తాజాగా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆయన చేసిన పాటలు మాత్రం పాతగా అనిపిస్తాయి. 'అహింస'లో ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం కూడా అంతే. కొన్నేళ్లుగా బడ్జెట్ విషయంలో బాగా పిసినారి అయిపోయిన సురేష్ బాబు.. కొడుకు సినిమా కదా అనేమీ రాజీ పడలేదు. ఎక్కువ ఖర్చు కాని లొకేషన్లను ఎంచుకుని.. పెద్దగా పేరు లేని ఆర్టిస్టులను తీసుకుని తక్కువ బడ్జెట్లో సినిమాను లాగించేసిన విషయం తెరపై కనిపిస్తుంది. ఐతే అడవుల్లో చిత్రీకరణకు టీం పడ్డ కష్టం మాత్రం తెరపై కనిపిస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ తేజ.. ఈ రోజుల్లో ఇలాంటి కథతో సినిమా తీసి మెప్పించగలమని ఎలా అనుకున్నారో ఆయనకే తెలియాలి. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తేజ మారినట్లు అనిపించాడు కానీ.. ఈ సినిమా చూశాక ఆయన మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. చివరి అరగంటలో కొన్ని సన్నివేశాల వరకు తేజ పనితనం కొంచెం కనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా ఆయన తీవ్ర నిరాశకు గురి చేశారు.

చివరగా: అహింస.. పెద్ద హింస

రేటింగ్-2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater