సరికొత్త వినోదంతో సంక్రాంతి సంబరాలు రెట్టింపు చేస్తున్న 'ఆహా'..!

Thu Jan 13 2022 20:20:25 GMT+0530 (India Standard Time)

Aha doubling the Sankranti festivities with the entertainment

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అప్లోడ్ చేస్తూ వీక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తూ వస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా టాక్ షోలు - వెబ్ సిరీస్ లు ప్రత్యేకంగా స్ట్రీమింగ్ పెడుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ వేదిక మీదకు తీసుకొచ్చిన 'అన్ స్టాపబుల్' షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య.. తొలిసారి హోస్ట్ గా మారి తోటి నటీనటులను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.బాలకృష్ణలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన 'అన్ స్టాపబుల్' టాక్ షో IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ కార్యక్రమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కు టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతూ 5వ స్థానంలో నిలిచింది. సౌత్ నుంచి ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి టాక్ షో ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు సంక్రాంతి కానుకగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గెస్టుగా హాజరైన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ లో వీడీతో పాటుగా డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు చార్మీ కౌర్ సందడి చేశారు. రేపు శుక్రవారం ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'లైగర్' మరియు 'లయన్' కు మధ్య ఎలాంటి ఆసక్తికరమైన సంభాషణ చూడాలనుకుంటున్నారు.

అలానే ఫెస్టివల్ మూడ్ ని మరింత రెట్టింపు చేయడానికి ఆహా ఓటీటీ.. జనవరి 14న ''ది అమెరికన్ డ్రీమ్'' అనే ఇంట్రెస్టింగ్ ఒరిజినల్ మూవీని స్ట్రీమింగ్ పెడుతోంది. డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్లిన ఓ యువకుడు అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో యువ హీరో ప్రిన్స్ ప్రధాన పాత్ర పోషించగా.. నేహా కృష్ణ - శుభలేఖ సుధాకర్ - రవితేజ ముక్కవల్లి - శ్రీ మిరాజ్ కర్ - ఫణి రాంపల్లి - అనిల్ శంకరమంచ్ - మురళీధర్ - శ్రీ రాంరెడ్డి ఆసిరెడ్డి - రవికుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

''ది అమెరికన్ డ్రీమ్'' చిత్రానికి విఘ్నేశ్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ప్రదీప్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అభినయ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. ఆడమ్ చంపాన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శశాంక్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. మరి ఈ ఒరిజినల్ ఎలాంటి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుందో చూడాలి.