నయా ట్రెండ్: వయసుతో పనేముంది?

Thu Aug 09 2018 07:00:26 GMT+0530 (IST)

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పెళ్లికి రెడీ అయిపోతోంది. హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఆమె త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కేయబోతోంది. ఐతే ఈ సందర్బంగా జనాల దృష్టంతా ప్రియాంకకు.. నిక్ కు మధ్య వయసు అంతరం మీదే ఉంది. ఏకంగా పదేళ్లు చిన్నవాడైన వ్యక్తిని ప్రియాంక పెళ్లాడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ అంతరం మరీ ఎక్కువగా ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఐతే సెలబ్రెటీల్లో వయసు అంతరం చూసుకోకుండా పెళ్లిళ్లు చేసుకోవడం కొత్తేమీ కాదు. హీరోయిన్లు తమకంటే చిన్నవాళ్లను పెళ్లాడిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇందుకు మన మహేష్ బాబు-నమ్రతలే ఉదాహరణ.మహేష్ కంటే నమ్రత మూడేళ్లకు పైగా పెద్దది. కానీ మహేష్ అదేమీ పట్టించుకోలేదు. ‘వంశీ’ సినిమా సందర్భంగా వీళ్లిద్దరి మనసులు కలిశాయి. కొంత కాలానికే పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. టాలీవుడ్లో బెస్ట్ సెలబ్రెటీ కపుల్స్ లో వీళ్ల పేర్లు ముందుంటాయి. ఇక బాలీవుడ్లో ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి. అందాల సుందరి ఐశ్వర్యారాయ్ కంటే అభిషేక్ బచ్చన్ రెండేళ్లు చిన్నవాడు. అతడి కంటే ముందు ఇద్దరిని ప్రేమించిన ఐష్.. వాళ్లతో కొనసాగలేకపోయింది. చిన్నవాడైనప్పటికీ అభిషేకే ఆమెకు సరైన జోడీ అనిపించాడు. అమితాబ్ కుటుంబంలోనూ అభ్యంతరం లేకపోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక బాలీవుడ్లో వయసు అంతరం చాలా ఉన్న జంట మరొకటి ఉంది. వాళ్లే సైఫ్ అలీ ఖాన్-అమృతా సింగ్. సైఫ్ కంటే అమృత 12 ఏళ్లు పెద్దది కావడం విశేషం. అయినా వీరి పెళ్లి జరిగింది. కానీ వేరే కారణాలతో వీళ్ల మధ్య విభేదాలొచ్చాయి. పెళ్లయిన 12 ఏళ్లకు వీళ్లు విడిపోయారు. సైఫ్ తర్వాత కరీనాను పెళ్లాడాడు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం ఆమె కంటే ఏడాది చిన్నవాడు కావడం విశేషం.