Begin typing your search above and press return to search.

నారప్ప విడుదల వేళ.. ఆయన సారీ చెప్పారెందుకు?

By:  Tupaki Desk   |   20 July 2021 5:12 AM GMT
నారప్ప విడుదల వేళ.. ఆయన సారీ చెప్పారెందుకు?
X
ప్రపంచ గతిని కరోనా ఎంతలా మార్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో నేషనల్ హైవే మీద దూసుకెళుతున్న వాహనాన్ని ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. కరోనా దెబ్బకు ప్రపంచ గమనానికి సైతం అలాంటి పరిస్థితే ఎదురైంది. మహమ్మారి కారణంగా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని దెబ్బేయటమే కాదు.. ఎన్నో రంగాల్ని కోలుకోని పరిస్థితికి తీసుకొచ్చింది. మొదటి వేవ్ తో అతలకుతలమైన వారు.. దాని తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుంటే సెకండ్ వేవ్ సీరియస్ గా హిట్ చేసి.. దారుణ డ్యామేజీని మిగిల్చింది. మొత్తంగా సెకండ్ వేవ్ తర్వాత చాలామంది మైండ్ సెట్ మారిపోయిన పరిస్థితి. కరోనా కారణంగా వినోద పరిశ్రమ.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసే తీరుకు భిన్నంగా ఓటీటీలో విడుదల చేసే పరిస్థితి. మిగిలిన చిత్ర పరిశ్రమల సంగతి ఎలా ఉన్నా.. తెలుగుకు సంబంధించి ఇప్పటివరకు చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో విడుదల అయ్యాయి. అందుకు భిన్నంగా స్టార్ హీరో.. స్టార్ ప్రొడ్యూసర్.. స్టార్ డైరెక్టర్.. ఇలా ఎవరికి వారిగా చూసినా.. ఉమ్మడిగా చూసినా వంక పెట్టలేని టీం నిర్మించిన నారప్ప మూవీని థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయటం షాకింగ్ మారింది.

ఈ నిర్ణయం టాలీవుడ్ లో కొత్త చర్చకు తెర తీసింది. ఒక స్టార్ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేయటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. ఉమ్మడిగా (సురేష్ బాబు.. కలైపులై థాను) నిర్మించిన ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రోజు (మంగళవారం) నారప్ప చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను వెంకటేశ్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పారు.

నారప్ప చిత్రంలో వెంకటేశ్ అద్భుతంగా నటించారని.. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయటంపై పలువురు అభిమానులు నిరాశకు గురవుతున్నారన్న విషయాన్ని తాను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పారు.

ఓటీటీలో విడుదల చేసే విషయంలో సురేశ్ బాబుకు కూడా ఇష్టం లేదని.. తానే ఆయనపై ఒత్తిడి చేసి మరీ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఒక డిస్ట్రిబ్యూటర్ గా తాను కూడా నారప్పను థియేటర్లోనే చూడాలని కోరుకుంటానని.. అనివార్య పరిస్థితుల్లోనే తానీ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మొత్తానికి సినిమా విడుదలకు కాస్త ముందుగా నారప్ప నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను క్షమాపణలు చెప్పటం ఆసక్తికరంగా మారింది.