'నారప్ప'లో చేయాలంటే భయమేసింది: కార్తీక్ రత్నం

Thu Jul 22 2021 10:02:56 GMT+0530 (IST)

Afraid to do in 'Narappa': Karthik Ratnam

వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందింది. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' కి ఇది రీమేక్. అక్కడ వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను ఇక్కడ రీమేక్ చేశారు. వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి చేయగా ఆయన పెద్ద కొడుకు 'మునికన్నా' పాత్రలో కార్తీక్ రత్నం చేశాడు. ఈ 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కార్తీక్ రత్నం తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు.'నారప్ప'లో నేను చేసిన 'మునికన్నా' పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఈ పాత్ర లభించడం నిజంగా నా  అదృష్టం. ఈ పాత్ర కోసం చాలామంది ఆర్టిస్టుల పేర్లను పరిశీలించారట. చివరికి ఆ పాత్రకు నన్ను తీసుకోవడమనేది నిజంగా నేను చేసుకున్న అదృష్టమే. సినిమాలో నా పాత్ర నిడివి తక్కువే అయినా కథ మొత్తం కూడా నా గురించిన ప్రస్తావన నడుస్తూ ఉంటుంది. అందువలన నా పాత్రను ప్రేక్షకులు మరిచిపోయే అవకాశం ఉండదు. అలా సినిమా మొత్తం నేను ఉన్నాననే ఫీలింగ్ కలగడం వల్లనే అనుకుంటాను ఇంత పేరు వచ్చింది.

ఈ సినిమా కోసం చాలా పెద్ద సెట్ వేశారు .. అంత పెద్ద సెట్ చూడటం కూడా నాకు ఫస్టు టైమ్. ఈ సినిమాకి సంబంధించి నేను మొదటిసారిగా పెళ్లి చూపుల సీన్ కోసం కెమెరా ముందుకు వెళ్లాను. కెమెరా కూడా నన్ను కంగారు పెట్టేసింది. అంత పెద్ద కెమెరాను నేను అంతకు ముందు చూడలేదు. 'నువ్వు చేయగలవు' అంటూ అక్కడున్న వాళ్లంతా నన్ను ఎంకరేజ్ చేశారు. నేను కూడా 'నేను చేయగలను' అనే నమ్మకాన్ని పెంచుకుంటూ సెట్లోకి అడుగుపెట్టాను. సీనియర్ నటుల సహకారంతోనే నేను ఇంకా బాగా చేయగలిగాను. వాళ్లు అందించిన సహకారం మరిచిపోలేనిది.

ఈ సినిమాలో నా పాత్ర చాలా పవర్ఫుల్ .. ఫైట్లు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 'వీడు ఉండగా వీడి ఫ్యామిలీ జోలికి ఎవరూ వెళ్లలేరు' అనిపించేలా ఉండే పాత్ర. ప్రతి విషయానికి చాలా ఆవేశపడే పాత్ర .. ఎప్పుడూ కోపంగా కనిపించే పాత్ర.  నిజానికి నేను బయట చాలా సాఫ్ట్ .. అందువలన ఈ పాత్రకు నేను సరిపోతానా? నేను చేయగలనా? అనే డౌటు నాకు వచ్చింది. బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉండాలి. ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి వచ్చింది. ఇలా ఈ సినిమా నాకు మంచి పాత్రను .. మంచి అనుభవాన్ని .. మంచి జ్ఞాపకాన్ని ఇచ్చింది.       

వెంకటేశ్ గారు .. ప్రియమణి గారు .. రాజీవ్ కనకాల గారు .. వీరందరూ చాలా సీనియర్స్. వాళ్లతో కలిసి నటించాలనేసరికి నాకు కొంచెం బెరుకుగా అనిపించింది. వెంకటేశ్ గారు నటనను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. సెట్లో ఆయన చాలా కూల్ గా ఉంటారు .. అందరినీ ఒకలానే చూస్తారు. షూటింగులో ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినా .. ఎక్కువ టేకులు తీసుకుంటున్నా ఆయన విసుక్కోరు. 'బాగా చేయమ్మా' అనే ప్రోత్సహిస్తారు. నిజానిగా అంత గొప్ప నటుడితో కలిసి ఇంత త్వరగా చేసే అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.