Begin typing your search above and press return to search.

హీరో బిరుదు కాదు .. కంటెంట్ న‌డిపిస్తుంద‌న్న‌ శేష్‌

By:  Tupaki Desk   |   23 May 2022 3:06 AM GMT
హీరో బిరుదు కాదు .. కంటెంట్ న‌డిపిస్తుంద‌న్న‌ శేష్‌
X
మెగాస్టార్ .. న‌ట‌సింహా.. విక్ట‌రీ.. కింగ్ ఇవ‌న్నీ టాలీవుడ్ లో నాలుగు పోల్స్ గా చెప్పుకునే సీనియ‌ర్ క‌థానాయ‌కుల‌ బిరుదులు. ఆ త‌ర్వాత యువ‌హీరోల‌కు అదే తీరుగా బిరుదులు ఉన్నాయి. మెగా ప‌వ‌ర్ స్టార్ ... సూప‌ర్ స్టార్.. రెబ‌ల్ స్టార్ .. యంగ్ టైగ‌ర్.. స్టైలిష్ స్టార్ (ఐకాన్ స్టార్).. ఇలా బిరుదుల‌కు కొద‌వేమీ లేదు. ప‌వ‌ర్ స్టార్ .. మాస్ మ‌హారాజా లాంటి బిరుదుల‌కు ఉన్న మాస్ ప‌వ‌ర్ ఎలాంటిదో తెలిసిన‌దే.

ఇక‌పోతే ఎలాంటి బిరుదులు లేకుండా హిట్టు మీద హిట్టు కొట్టే హీరో ప‌రిస్థితి ఏమిటీ? అంటే.. దానికి ఆన్స‌ర్ ఇక్క‌డ దొరుకుతుంది. ఇంత‌కుముందు క్ష‌ణం- గూఢచారి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన అడివి శేష్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా త‌న రేంజును పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. అదే క్ర‌మంలో మ‌హేష్ నిర్మాత‌గా.. మేజ‌ర్ చిత్రం లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ మేజర్ ప్రమోషన్ లో శేష్ బిజీగా ఉన్నాడు.

అడివి శేష్ తన అభిమానులు అనుచరులతో ఇంత‌కుముందే ట్విట్టర్ చాట్ చేశాడు. ఇది ఇప్పుడు అభిమానుల్లో చర్చకు దారితీసింది. ఈ ప్రమోషన్ లో పాల్గొన్న అడివి శేష్ ట్విటర్ లో అభిమానుల కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అందులో ఒక ప్రశ్నకు సూటిగా స్పందించాడు. శేష్ కి `థ్రిల్లింగ్ స్టార్` అనే బిరుదు ఇవ్వాల‌నేది అభిమాని సూచ‌న‌. ఈ టైటిల్ పై అడివి శేష్ ను ట్విట్టర్ లో అడిగారు.

కానీ దానికి శేష్ స్పంద‌న ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అత‌డు బిరుదుల‌పై ఏమంత ఆస‌క్తిగా లేడ‌ని అర్థ‌మైంది. తన సినిమాలకు బలమైన క‌థ‌లు కంటెంట్ ఉన్నాయ‌ని అందువల్ల హీరోగా ట్యాగ్ లైన్ అవసరం లేదని సూచించారు. మేజర్ సంవత్సరంలో ఈ ఏడాది అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా ఉంటుందని... త‌న మూవీ విజయాన్ని ప్రజలు గమనిస్తారని పేర్కొన్నారు. ప‌లువురు తార‌లు త‌మ‌కు తాముగా బిరుదులు ఎంచుకున్నారు. ఫ్యాన్స్ ఇచ్చార‌ని చెప్పుకున్నారు. కానీ అందుకు భిన్నంగా యువ‌హీరో శేష్ స్పందించ‌డం ఆస‌క్తిక‌రం.

ఇప్ప‌టికే విడుద‌లైన మేజ‌ర్ ట్రైల‌ర్ దూసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. సీరియ‌స్ గా ఎమోష‌న‌ల్ గా సాగే మేజ‌ర్ క‌థ‌లో ప్రేమ క‌థ కూడా ఆస‌క్తిని పెంచింది. అయితే ఇందులో కేవ‌లం ఆర్మీ అధికారి సాహ‌సాలు త్యాగాలు బార్డర్ డ్రామానే కాదు.. అత‌డి వ్య‌క్తిగ‌త ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా చూపిస్తున్నారు. ల‌వ్ లైఫ్ రొమాన్స్ మ్యారేజ్ వ‌గైరా కూడా తెర‌పై క‌నిపిస్తాయి. అయితే ఇందులో లిప్ లాక్ ప్ర‌ధానంగా హైలైట్ కావ‌డంతో దానిపైనా చ‌ర్చ సాగుతోంది.

ఇంత‌కీ మేజ‌ర్ క‌థేంటి? అంటే.. ముంబై దాడుల్లో ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు ప్ర‌ణాలొడ్డి తీవ్ర‌వాదుల‌తో పోరాడిన రియ‌ల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఇది. ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌లో అడివి శేష్ న‌టించగా అత‌డి ల‌వ్ గా స‌యీ మంజ్రేక‌ర్ న‌టించింది. ఈ సినిమా ట్రైలర్ కు విశేష ఆదరణ లభించడంతో పాటు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ వెల్ల‌డించింది. అడివి శేష్ - సాయి మంజ్రేకర్ మధ్య హీటెక్కించే లిప్ లాక్ సన్నివేశం ఉందని చూపించారు. భార్య‌తో రొమాన్స్ కూడా ఇందులో హైలైట్ గా ఉండ‌నుంది.

మేజ‌ర్ ఫ్యామిలీతో శేష్ భేటీ

`మేజర్` పాన్ ఇండియా క‌థాంశంతో రూపొందుతోంది. శ‌శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుదల కానుంది. ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవ‌న‌ ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆవిష్క‌రిస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభ‌రితంగా తెర‌పై చూపించ‌నున్నారు.

మేజర్ జీవితంలోని వివిధ దశలను తెర‌పై చూపిస్తున్నారు. K ఉన్నికృష్ణన్ - ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ ల‌తో ఇంత‌కుముందు శేష్ ముచ్చ‌ట్లాడిన ఫోటో వైర‌ల్ అయ్యింది. ప్రతి సంవత్సరం సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ప్రియమైన కొడుకు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ ని సందర్శిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సమయంలో శేష్ .. మేజర్ సందీప్ తల్లిదండ్రుల మధ్య బంధం మరింత ఘాడంగా గొప్పగా మారింది. కాబట్టి తన తోటి దేశస్థులను కాపాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసిన భారతదేశపు కుమారుడిని గుర్తుచేసుకోవడానికి సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను శేష్ ఒక చిన్న సమావేశానికి ఆహ్వానించగా అత‌డు వారిని క‌లుసుకున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఎవ‌రికీ తెలియ‌ని కథను తెరపైకి తెస్తూ బహుభాషా చిత్రం `మేజర్`ని తెర‌కెక్కిస్తున్నామ‌ని శేష్ ఇప్ప‌టికే తెలిపారు.