మోక్షజ్ఞతో ఆదిత్య 369 మ్యాక్స్.. బాలయ్య ద్విపాత్రలు

Wed Jul 21 2021 10:14:39 GMT+0530 (IST)

Aditya 369 Max with Mokshagna ..balayya in dual role

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ మూవీ `ఆదిత్య 369` ఈ ఏడాదితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి  తెలిసిందే. లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా `ఆదిత్య 369 మ్యాక్స్` తెరకెక్కనుందని నటసింహా నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.2023లో ఈ సినిమా రిలీజవుతుందని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలోనూ టైమ్ ట్రావెల్ మెషీన్ తో అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో విజువల్ ట్రీట్ ఉంటుంది. ఇందులో తాను ద్విపాత్రలు పోషిస్తానని శ్రీకృష్ణ దేవరాయలు తరహాలో రెండు పాత్రలు ఉంటాయని కూడా బాలయ్య తెలిపారు. ఇక ఈ సినిమాకి కథను ఎన్బీకే రాస్తున్నారు. దర్శకుడు ఎవరు అన్నది త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సీక్వెల్ ని తనే స్వయంగా నిర్మించనున్నారు.

ప్రస్తుతం బోయపాటితో నటసింహా `అఖండ` లాంటి భారీ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజవుతుందని  తెలిపారు. తదుపరి గోపిచంద్ మలినేని- అనీల్ రావిపూడితో సినిమాలు చేస్తున్నానని అలాగే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లోనూ ఓ సినిమా చేస్తానని బాలయ్య వెల్లడించారు. ఇక పైసా వసూల్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో మరో సినిమా ఉంటుందని కూడా బాలకృష్ణ వెల్లడించారు. ఆయన నుంచి బ్యాక్ టు బ్యాక్ ధమాకా ఉంటుందని అభిమానులు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

బ్లాక్ డ్రెస్ ధరిస్తే ప్రమాదం?

మరో ఆసక్తికర విషయాన్ని తాజా చాటింగ్ లో బాలకృష్ణ వెల్లడించారు. ఆదిత్య 369 సమయంలో తనకు యాక్సిడెంట్ జరిగింది. దానికి కారణం ఆదివారం నాడు తాను బ్లాక్ డ్రెస్ లో ఉండడమేనని బాలకృష్ణ తెలిపారు. పరిశ్రమలో సెంటిమెంట్లను అనుసరించడంలో ఎన్బీకే తరువాతే. వారం వర్జ్యం రాహుకాలం ముహూర్తం అంటూ ప్రతిదీ పాటిస్తారు. శాస్త్రాల్ని ఆయన బలంగా విశ్వసిస్తారు. జ్యోతిష్యం సంఖ్యా శాస్త్రాన్ని నమ్ముతారు. తెలుగు సంస్కృత భాషలు అన్నా ఆయనకు ఎంతో అభిమానం. పురాణేతిహాసాలపై అపరిమిత విజ్ఞానం కలిగిన ఎన్బీకే మంత్రోచ్ఛారణలో నిష్ణాతుడు అన్న సంగతి విధితమే.