ప్రోమో 'అదిరింది'.. షో జబర్దస్త్ గా ఉంటుందా?

Wed Dec 11 2019 21:44:41 GMT+0530 (IST)

Adirindi Show Promo Looks Jabardhasth?

జబర్దస్త్ తో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధంను కొన్ని కారణాల వల్ల తెంచేసుకుంటున్నట్లుగా నాగబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. జబర్దస్త్ లో తన ప్రస్థానం ముగిసిందన్న నాగబాబు ఈ టీవీ నుండి జీ టీవీకి షిప్ట్ అయ్యాడు. జీ తెలుగు ఛానెల్ లో ఒక కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదట లోకల్ గ్యాంగ్స్ ద్వారా నాగబాబు వస్తాడనుకున్నారు. కాని ఒక ఎపిసోడ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో రాకపోడంతో అసలు ఏమైంది.. నాగబాబు జీ తెలుగులో షో చేస్తున్నాడా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.నాగబాబు కొత్త షో కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. జబర్దస్త్ తరహాలో ఉండేలా అదే టీంతో కామెడీ షోను డిజైన్ చేశారట. దీనికి 'అదిరింది' అనే క్యాచీ టైటిల్ ను పెట్టారు. ఇప్పటికే ప్రోమో ను విడుదల చేశారు. ప్రోమోలో పేల్చిన పంచ్ డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఎంత మంది ఉన్నారన్నది కాదు ముఖ్యం ఎవరున్నారు అనేది ముఖ్యం అంటూ నాగబాబు చెప్పిన డైలాగ్ జబర్దస్త్ కు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చినట్లయ్యిందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రోమోతో అయితే ఆకట్టుకున్నారు. మరి షో ఎలా ఉంటుందా అని ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జబర్దస్త్ ఈటీవీలో గురు.. శుక్ర వారాల్లో ప్రసారం అవుతుంది. ఇక 'అదిరింది' షోను ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబోతున్నారు. ఈనెల 15వ తారీకు నుండి ఈ షోను ప్రారంభించబోతున్నారు. అయితే ఆదివారం ఎక్కువగా సినిమాలపైనే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. జబర్దస్త్ మాదిరిగా వీక్ డేస్ లోనే అది కూడా 9 గంటల తర్వాత అయితే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరో మూడు రోజుల్లో 'అదిరింది' బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ కామెడీ షో లో ఎక్కువ శాతం మంది జబర్దస్త్ కమెడియన్స్ కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కాని ఇప్పటి వరకు ఈ కామెడీ షో లో ఉండేది ఎవరు.. అసలు ఈ షో ఎలా జరుగబోతుంది.. దీని యాంకర్ ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఆదివారమే ఆ విషయాలు అన్ని తెలుస్తాయే లేదంటే మరో ప్రోమోను ఏమైనా విడుదల చేస్తారేమో చూడాలి.