'ఆదిపురుష్' పై అభ్యంతరాలు: రాముడు ఇలా.. రావణుడు అలా..!

Tue Oct 04 2022 09:08:27 GMT+0530 (India Standard Time)

'Adipurush': Rama is like this.. Ravana is like that..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. అదే సమయంలో విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. నాసిరకం గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ తో పూర్తిగా నిరాశ పరిచారని కామెంట్స్ వస్తున్నాయి.ఒక కార్టూన్ మోషన్ పిక్చర్ టీజర్ ని చూస్తున్నామనే భావన కలిగిస్తోందని ట్రోల్ చేశారు. చాలా సన్నివేశాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ - ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మరియు ప్రసిద్ధ ఆన్ లైన్ టెంపుల్ రన్ గేమ్ నుండి కాపీ చేయబడ్డాయని కామెంట్స్ చేశారు. అయితే 'ఆది పురుష్' టీజర్ తో ఇప్పుడు హిందువులు కూడా హ్యాపీగా లేరనే చర్చ జరుగుతోంది.

రామాయణం ఇతిహాసం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ "ఆది పురుష్" సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కాలంలో హిందూ పురాణాలు సంస్కృతిని ఆవిష్కరించే సినిమాలు నార్త్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్న నేపథ్యంలో.. ఈ మైథలాజికల్ డ్రామా కూడా ఉత్తరాది ప్రేక్షకులను హిందుత్వ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుందని అందరూ భావించారు. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక అన్నీ మారిపోయాయి.

'ఆదిపురుష్' లో రావణుడు పాత్రని చూపించిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో లంకేశ్ పాత్రలో నటించిన సైఫ్ అలీఖాన్ ను శివుడి భక్తుడిగా కాకుండా.. ఇస్లామిక్ విలన్ గా ప్రెజెంట్ చేసారని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్పైక్స్ తో కూడిన ట్రెండీ హెయిర్ స్టైల్ మరియు షేప్ బియర్డ్ తో అలాంటి గెటప్ లో చూపించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

రావణుడు అనగానే అందరూ ఊహించుకునే రూపానికి.. ఆది పురుష్ లో సైఫ్ కనిపించిన తీరుకు అసలు పొంతనే లేదని కామెంట్స్ చేస్తున్నారు. అతను రావణ్ గా కాకుండా.. అలావుద్దీన్ ఖిల్జీగా కనిపించారని అభిప్రాయ పడ్డారు. నిజానికి సైఫ్ అలీఖాన్ ను ఈ పాత్ర కోసం తీసుకున్నప్పుడే.. ఒక ముస్లిం నటుడిని లంకేశ్ గా తీసుకోవడం ఏంటని ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి.

ఇప్పుడు ఫైనల్ గా మోడ్రన్ రావణుడిగా సైఫ్ లుక్ చూసిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నుదుటిన అడ్డంగా విభూతి రాసుకున్నా.. ఏమాత్రం శివ భక్తుడు అనే భావన కలగడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 'డిజప్పాయింటింగ్ ఆదిపురుష్' 'బాయ్ కాట్ బాలీవుడ్ కంప్లీట్లీ' వంటి హ్యాష్ ట్యాగ్స్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఓవైపు రావణ్ పాత్ర రూపకల్పనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు రాఘవ పాత్రపైనా పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి. రామకథలో రావణుడు మాత్రమే శివ భక్తుడుగా కనిపిస్తే.. ఇక్కడ రాముడు కూడా ఒళ్లంతా రుద్రాక్షలు ధరించి ఉండడం ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు.

జనాలు దేవుడిగా ఆరాధించే రాముడి పాత్రను నీలంగా చూపించలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అలానే ఇప్పటి వరకు రాముడి పాత్రను పోషించిన హీరోలందరూ పైవస్త్రం ధరించకుండా కనిపించారు. కానీ 'ఆది పురుష్' లో ప్రభాస్ కు కొన్ని సీన్స్ లో సిక్స్ ప్యాక్ చూపించగా.. మరికొన్ని చోట్ల పైవస్త్రంతో బాడీ కవర్ చేయబడింది. ఇదంతా సీజీ మాయాజాలమేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏదేమైనా రామాయణంలో రాముడు మరియు రావణుడు పాత్రలు సరిగ్గా ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ రెండు పాత్రల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ కథంతా నడుస్తుంది. అయితే అంత ప్రాముఖ్యత కలిగిన పాత్రల విషయంలో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెట్టింట నెగెటివ్ ట్రెండ్స్ వైరల్ అవుతున్నాయి. మరి 'ఆది పురుష్' రిలీజ్ అయ్యే నాటికి దాన్ని సానుకూలమైన అంశంగా మార్చి ఎలా బజ్ తీసుకొస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.