ఫైనల్ వర్క్ లో బిజీబిజీగా ఆదిపురుష్

Mon Jun 27 2022 18:00:01 GMT+0530 (IST)

Adipurush Busy In Final Work

రెబల్ స్టార్ అభిమానులు ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో తీవ్రంగా నిరాశ పడ్డారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ కొట్టింది అని చెప్పాలి. బాహుబలి సినిమా తరువాత అదే తరహాలో పాన్ ఇండియన్ మార్కెట్ ను కొనసాగించాలని ప్రభాస్ చేస్తున్న సినిమాలు దారుణంగా దెబ్బ కొడుతున్నాయి.  ఇక ఎలాగైనా తదుపరి సినిమాతో మాత్రం మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు.రామాయణ కథ ఆధారంగా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు అయితే దర్శకుడు ఓం రౌత్ కొన్ని నెలల క్రితమే పూర్తి చేశాడు.

అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల గ్రాఫిక్స్ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నట్లు గా తెలియజేశారు. అయితే ప్రస్తుతం మాత్రం ఫైనల్ వర్క్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం డబ్బింగ్ పనులు పూర్తయితే సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది. కొంతమంది నటీనటులు కూడా ఇప్పటికే వారికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రధాన తారాగణం డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు కాబట్టి పక్కా ప్రణాళికతో డబ్బింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

డబ్బింగ్ పనులు పూర్తవగానే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయాలని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇంతవరకూ ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడు అనే విషయంలో సరైన పోస్టర్ కూడా విడుదల చేయకపోవడం విశేషం. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయకుండా డైరెక్ట్ గా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.