బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడు యాసిడ్ దాడి చేసే ప్రయత్నం చేశాడన్న నటి

Tue Sep 14 2021 09:01:28 GMT+0530 (IST)

Actress Shocking Comments About Her Ex Boyfriend

భోజ్ పురి చిత్రాల్లో ప్రముఖ నటిగా.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ముద్దుగుమ్మ అక్షర సింగ్. భోజ్ పురి నుంచి బాలీవుడ్ కు రావటమే కాదు.. సర్కార్ రాజ్.. సత్య లాంటి చిత్రాల్లో తానేమిటో నిరూపించుకున్న ఆమె తాజాగా బిగ్ బాస్ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద ఎంతలా సందడి చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన అంశాల్ని వెల్లడించింది. తన జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలు.. సవాళ్ల గురించి ఆమె చెప్పిన మాటలు సంచలనంగా మారాయి.తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉండి.. తర్వాత తామిద్దరికి బ్రేకప్ జరిగినట్లుగా చెప్పిన అక్షర సింగ్.. ఆ తర్వాత తాను నరకాన్ని చూసినట్లుగా చెప్పారు. బ్రేకప్ తర్వాత తన మాజీ ప్రియుడు మనుషుల్ని పెట్టించి మరీ.. తనపై యాసిడ్ దాడి చేయాలని.. తన కెరీర్ ను సర్వనాశనం చేయాలని ప్రయత్నించినట్లు చెప్పారు. ఎన్నో బెదిరింపుల్ని తాను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

చంపేస్తామని.. కెరీర్ నాశనం చేస్తామని చాలానే బెదిరింపులు వచ్చాయి. కానీ.. మా నాన్న నాకిచ్చిన ధైర్యంతో నేను చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాను అని చెప్పారు. ‘బెదిరింపులకు లొంగలేదు. వాటి గురించి పట్టించుకోవటం మానేశాను. నా ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. ఇప్పటికే ఎన్నో సమస్యల్ని ఫేస్ చేశాను. నీ గొంతు కోస్తాం. చంపేస్తామంటూ కొందరు బెదిరించారు. దమ్ముంటే చంపాలని సవాలు చేశాను’ అని పేర్కొన్నారు.

తన జీవితంలో తాను పడిన బాధలు.. మరే మహిళా బాధ పడొద్దని తాను దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను డిప్రెషన్ కు గురయ్యానని.. దాని నుంచి ఇప్పుడు కోలుకున్నట్లు చెప్పింది. బిగ్ బాస్ ఓటీటీలో ఇటీవల ఎలిమినేట్ అయిన ఆమె.. ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సంచలన అంశాల్ని వెల్లడించారు. బిగ్ బాస్ ఓటీటీలో ఆమె ఉన్నన్ని రోజులు ఉత్సాహంగా.. అందరిని ఆకట్టుకునేలా ఆమె వ్యవహరించారు.

బాలీవుడ్ లో తన కెరీర్ ప్రారంభం గురించి.. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు. నటిగా కెరీర్ ను ఎంచుకుంటానంటే ఒప్పుకునే కుటుంబం నుంచి తాను రాలేదన్నారు. ‘సంప్రదాయ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. కెరీర్ ఆరంభంలో ఆఫర్స్ వచ్చేవి కావు. ఒకవేళ వచ్చినా.. సరైన కారణం లేకుండానే అవి చేజారిపోయేవి. ఇప్పుడా సమస్యల్ని అధిగమించా. నాన్న ఇచ్చిన ధైర్యంతోనే ఇండస్ట్రీలోనూ రాణిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. ఆమె మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.