'పౌర్ణమి' సినిమానే కోలుకోని దెబ్బకొట్టేసింది!

Sun Jun 26 2022 15:00:01 GMT+0530 (IST)

Actor Sumanth Aswhin About Pournami Movie

సినిమాలు నిర్మించడం .. వాటిని రిలీజ్ చేయడం .. నష్టాలను తట్టుకుని నిలబడటం అంత తేలికైన విషయమేం కాదు. సినిమా అంటే ఉండే ఇష్టం వలన నిర్మాతలుగా వచ్చి ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమైనవారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడే పోగొట్టుకున్నాం కనుక ఇక్కడే వెతుక్కోవాలి అనే పట్టుదలతో పోరాడేవాళ్లూ ఉన్నారు. అలాంటి నిర్మాతలలో ఎమ్మెస్ రాజు ఒకరు. 'వర్షం' .. 'ఒక్కడు' .. నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి హిట్స్ ఆయన జాబితాలో కనిపిస్తాయి.ఈ మధ్య కాలంలో దర్శకుడిగా మారిపోయిన ఆయన వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన తాజా చిత్రమైన 7 డేస్ 6 నైట్స్' మొన్ననే థియేటర్లకు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ .. "మా బ్యానర్లో వచ్చిన 'ఒక్కడు' మహేశ్ బాబును .. 'వర్షం' ప్రభాస్ ను నిలబెట్టేశాయి. అలాగే హీరో సిద్ధార్థ్ కి కూడా మా బ్యానర్ లైఫ్ ఇచ్చింది. అయితే ఆ హీరోలందరిలో ఉన్న ప్రత్యేకతలను నేను గమనించాను. వాళ్లు ఎదగడానికి గల కారణాలను గ్రహించి ఆ మార్గంలో ముందుకు వెళ్లడానికి ట్రై చేస్తున్నాను.

మా బ్యానర్లో వచ్చిన సినిమా హిట్ అయినా .. ఫ్లాప్ అయినా ఇంటి దగ్గర వాతావరణంలో పెద్దగా మార్పు ఉండేది కాదు. అందువలన ఫ్లాప్ ప్రభావం ఎంతవరకూ ఉంటుందనేది  నాకు తెలియదు. నాతో సినిమాలు చేయటం వల్లనే నాన్న బాగా  లాస్ అయ్యారని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజానికి మా బ్యానర్లో నేను ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అసలు నేను హీరోగా వచ్చే సమయానికే  నాన్న లాస్ కావడం జరిగిపోయింది. అందువలన నా కారణంగా నాన్న నష్టపోవడమనే దాంట్లో నిజం లేదు.

నాన్న కొత్త హీరోను పెట్టి 'వాన' సినిమాను తీశారు. ఆ సినిమా వలన నష్టాలు వచ్చాయి. ఇక ప్రభాస్ తో రెండో సినిమాగా 'పౌర్ణమి'ని ప్లాన్ చేశారు. 'వర్షం' తరువాత అదే కాంబినేషన్లో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. అందువలన ఉన్నదంతా తీసుకుని వచ్చి ఆ సినిమాపై పెట్టారు. సెట్స్ కోసం భారీస్థాయిలో కోసం ఖర్చు చేశారు. ఆ సినిమాకి ప్రశంసలు వచ్చాయి .. కానీ ఫ్లాప్ అయింది. ఆ సినిమా వలన వచ్చిన నష్టాలు నాన్న కెరియర్ పై బాగానే ఎఫెక్ట్ చూపించాయి. ఆ సినిమా పెద్ద దెబ్బనే కొట్టేసింది" అంటూ చెప్పుకొచ్చాడు.