విషాదం.. మీనా భర్త హఠాన్మరణం

Wed Jun 29 2022 09:12:48 GMT+0530 (IST)

Actor Meena Husband Vidyasagar Passes Away

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ హీరోయిన్ మీనా ఇంట విషాదం చోటు చేసుకుంది. మీనా భర్త విద్యా సాగర్ గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త సినీ వర్గాల వారికి మరియు ప్రేక్షకులకు కూడా షాకింగ్. చిన్న వయసులోనే మీనా భర్త మృతి చెందడంతో విచారకరం.ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆ సమయంలో కొన్ని రోజుల తర్వాత వారు అంతా కూడా కరోనా నుండి కోలుకున్నారు. కాని పోస్ట్ కోవిడ్ సమస్యలు విద్యాసాగర్ ను వదిలి పెట్టలేదు. కరోనా ముందు వరకు అంతా బాగానే ఉన్నా.. కరోనా వచ్చి వెళ్లిన తర్వాత విద్యాసాగర్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు.

ఊపిరితిత్తులు సరిగా పని చేయక పోవడం తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఆయనను కోవిడ్ తర్వాత వెంటాడుతూ వచ్చాయట. గత కొన్ని రోజులుగా అస్వస్థతతో ఉన్న విద్యాసాగర్ ను ఇటీవల ఆసుపత్రిలో జాయిన్ చేయడం.. ఆయన కోలుకుంటూ ఉన్నాడని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆయన మృతి చెందడంతో మీనా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు.

ఊపిరితిత్తుల మార్పిడి ద్వారా విద్యాసాగర్ ను బతికించాలని వైధ్యులు భావించారు. కాని డోనర్స్ లభించక పోవడంతో విద్యాసాగర్ కు కృతిమంగా చికిత్స అందిస్తూ వస్తున్నారు. డోనర్స్ దొరికే వరకు ఆయనను కాపాడుకోవాలని భావించినా కూడా సాధ్యం కాలేదట. మంగళవారం రాత్రి విద్యాసాగర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లడం.. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర సేవలు అందించినా కూడా ఫలితం లేకుండా పోయింది.

పోస్ట్ కరోనా వల్ల గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు ఎంతో మంది ప్రముఖులు మృతి చెందిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ జాబితాలో మీనా భర్త విద్యాసాగర్ కూడా చేరారు. ఆయన మరణ వార్త తమిళ మరియు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న మీనా సన్నిహితులు.. స్నేహితులు అభిమానులకు షాకింగ్ గా మారింది.

మీనా 1990 ల్లో టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల అందరితో కూడా సినిమాల్లో నటించి మెప్పించింది. నటిగా సుదీర్ఘ కెరీర్ ను కొనసాగించిన మీనా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి ఆ తర్వాత 2009 సంవత్సరంలో విద్యా సాగర్ ను వివాహం చేసుకున్నారు. మీనా.. విద్యా సాగర్ దంపతులకు ఒక పాప ఉంది. ఆ పాప కూడా వెండి తెరపై తమిళ సినిమా ద్వారా సందడి చేసిన విషయం తెల్సిందే.