Begin typing your search above and press return to search.

నష్టపోయిన 'ఆచార్య' డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం ఎంతంటే ..?

By:  Tupaki Desk   |   16 May 2022 3:30 PM GMT
నష్టపోయిన ఆచార్య డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం ఎంతంటే ..?
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం కావడం.. RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారిన చరణ్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి.

అయితే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ చివరి వారంలో విడుదలైన 'ఆచార్య' మూవీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. తొలి రోజే ప్లాప్ టాక్ వచ్చినా వసూళ్లకు డోకా లేకుండా పోయింది. కానీ రెండో రోజు నుంచి థియేటర్లలో జనాలు కనిపించలేదు. దీంతో నాలుగు రోజులకే థియేటర్లలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది.

'ఆచార్య' సినిమా దారుణమైన ఫలితాన్ని చవిచూడటంతో.. బయ్యర్లు భారీగా నష్టాలు అందుకున్నారు. ఈ నష్టం దాదాపు 80 కోట్లు వరకూ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూటర్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ & ఎగ్జిబిటర్ ఒకరు నష్టపరిహారాన్ని కోరుతూ ఏకంగా 'ఆచార్య' మేకర్స్ కి బహిరంగ లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది. పెట్టుబడిలో 25% మాత్రమే తిరిగి వచ్చిందని.. 75% నష్టంతో అప్పుల పాలయ్యానని.. తీవ్ర సంక్షోభంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాలని లెటర్ లో పేర్కొన్నారు.

అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' డిస్ట్రిబ్యూటర్‌లతో మాట్లాడి వారికి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది. ఇందుకుగాను దర్శక హీరోల మీద కొంత మేర భారం పడుతోందని అనుకుంటున్నారు.

కొరటాల శివ 25 కోట్ల రూపాయలను తిరిగి ఇస్తుండగా.. చిరంజీవి 5 కోట్లు మరియు రామ్‌ చరణ్ 5 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారట. అంతేకాదు కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో రాబోతున్న 'గాడ్ ఫాదర్' హక్కులను తక్కువ ధరకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

కొణిదెల సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు. అయితే కొరటాల కానీ.. చిరు - చరణ్ కానీ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదని చెబుతున్నారు. కాకపోతే ఈ నాలుగేళ్ళలో తమ ఖర్చుల కోసం అంతో ఇంతో తీసుకొని ఉంటారు.

ఇక భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. సినిమా నిర్మాణం కోసం అయిన బడ్జెట్ ను పక్కన పెడితే.. కొంత భాగం మిగిలి ఉంటుంది. ఇప్పుడు దర్శక హీరోలు పెద్ద మనసు చేసుకొని ఆ మొత్తాన్ని 'ఆచార్య'తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు పరిహారంగా చెల్లిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.