విడిపోయినా కలిసి పని చేయడంలో రాజీ లేని జంట!

Sun Oct 24 2021 05:00:02 GMT+0530 (India Standard Time)

Aamir Khan and Kiran Rao work together

విడిపోవడం వేరు. కలిసి ప్రొఫెషనల్ గా పని చేయడం వేరు. ఈ రెండు రకాల వైరుధ్యాలను బ్యాలెన్స్ డ్ గా పరిణతితో అనుసరిస్తున్నారు అమీర్ ఖాన్ - కిరణ్ రావు మాజీ జంట. ఇటీవలే ఈ జంట విడాకులు ప్రకటించినా ఇప్పుడు మళ్లీ చేతులు కలిపారు. సంవత్సరాల సంసార జీవనం అనంతరం ఈ జంట నిర్ణయం ఆశ్చర్యపరిచింది. విడాకుల నిర్ణయం అనంతరం కూడా ప్రస్తుతం ఇంకా లాల్ సింగ్ చద్దా కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2022లో విడుదల కానుంది.అయితే ఈ జంట ఒకరినుంచి ఒకరు విడిపోయినప్పటికీ సినిమాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. పదకొండు సంవత్సరాల క్రితం కిరణ్ రావు ధోబీ ఘాట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆమె త్వరలో ఒక సాంఘిక డ్రామాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో ముక్కోణ ప్రేమకథ హైలైట్ గా ఉంటుందట. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా మొత్తం ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామంలో చిత్రీకరిస్తారు.

ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. అమీర్ ఖాన్ కాన్సెప్ట్ నచ్చి నిర్మాత తనాజీ దాస్గుప్తాతో కలిసి సహనిర్మాతగా కొనసాగుతున్నారు. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇందులో అమీర్ నటించే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. మరోవైపు లాల్ సింగ్ చద్దా పెండింగ్ పనులపైనా అమీర్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య ఓ కీలక పాత్రను పోషించారు. నాగచైతన్య `లవ్ స్టోరి` ప్రమోషన్స్ కోసం అమీర్ ఖాన్ హైదరాబాద్ విచ్చేసి ప్రమోషనల్ వేదికపై చైతూ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అమీర్ - కిరణ్ రావు ఆదర్శంగా ఇప్పుడు విడిపోయినా చైతన్య - సమంత కలిసి పని చేస్తారా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.