దేవుడి మీద ఒట్టు తప్పుతున్న 'ఆకాశవాణి'

Thu Aug 13 2020 17:40:56 GMT+0530 (IST)

'Aakashavaani' blaspheming against God

దర్శక ధీరుడు రాజమౌళి వద్ద సహాయ దర్శకుడిగా చేసిన అశ్విన్ గంగరాజు దర్శకుడిగా రూపొందిన చిత్రం ‘ఆకాశవాణి’. ఈ చిత్రంతో ఎస్‌ఎస్ కార్తికేయ పూర్తి స్థాయి నిర్మాతగా మారబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. కాని సినిమా నుండి కొన్ని కారణాల వల్ల తప్పుకున్నట్లుగా కొన్ని రోజుల క్రితం కార్తికేయ ప్రకటించాడు. కార్తికేయ తప్పుకోవడంతో సినిమా ఉంటుందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అలాంటి సమయంలో మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో దేవుడి మీద ఒట్టు ఖచ్చితంగా థియేటర్లో కలుద్దాం అంటూ చెప్పారు.మోషన్ పోస్టర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రాదని ఖచ్చితంగా థియేటర్ లోనే విడుదల చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కాని అనూహ్యంగా ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట. పెట్టిన పెట్టుబడికి అదనంగా 50 శాతం ఇచ్చేందుకు ముందుకు రావడంతో మేకర్స్ మొగ్గినట్లుగా చెబుతున్నారు.

షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగించే పనిలో ఉన్నారట. చిత్రం విడుదలపై మోషన్ పోస్టర్ లో క్లారిటీగా చెప్పారు. కాని ఇప్పుడు జరుగుతున్న ప్రచారం వేరేగా ఉంది. కనుక మళ్లీ చిత్ర యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ వస్తే కాని విడుదల విషయంపై నెలకొన్న సస్పెన్స్ కు సమాధానం దొరకదు. ఓటీటీలో విడుదల చేసినా కూడా మంచి లాభాలు రావడంతో పాటు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని భావించినప్పుడు థియేటర్ల ఓపెన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.