Begin typing your search above and press return to search.

#AB7 ప్రీ లుక్: థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్న ఓంకార్ తమ్ముడు..!

By:  Tupaki Desk   |   31 July 2021 12:30 PM GMT
#AB7 ప్రీ లుక్: థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్న ఓంకార్ తమ్ముడు..!
X
టాలీవుడ్ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు.. తన సోదరుడు డైరెక్ట్ చేసిన 'జీనియస్' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు చిత్రాల్లో నటించిన అశ్విన్.. తాజాగా ప్రీ లుక్ పోస్టర్ ద్వారా తన 7వ చిత్రాన్ని ప్రకటించాడు. #AB7 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లింగ్ ప్రాజెక్ట్ కోసం అశ్విన్.. కంప్లీట్ మీకోవర్ అయినట్లు తెలుస్తోంది. కేవలం ఒక చెయ్యి మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో యువ హీరో పిడికిలి బిగించి ఉన్నాడు. ఇంతకముందు ఎన్నడూ లేని కొత్త లుక్ లో అశ్విన్ కనిపించనున్నాడని తెలుస్తోంది. దీని కోసం భారీ వర్కౌట్స్ చేసి కండలు పెంచినట్లు అర్థం అవుతుంది.

#AB7 చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు (ఆగస్ట్ 1) ఆదివారం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ గతంలో కళ్యాణ్ రామ్ తో 'అసాధ్యుడు' - మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య' - సందీప్ కిషన్ తో 'రన్' వంటి చిత్రాలను తెరకెక్కించాడు. అశ్విన్ బాబు సినిమా అతనికి నాలుగో ప్రాజెక్ట్. శ్రీ విగ్నేస్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వికాస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఎమ్ ఆర్ వర్మ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం.

కాగా, స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన అశ్విన్.. ఫస్ట్ సినిమా 'జీనియస్' తో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఓంకార్ దర్శకత్వంలోనే 'రాజు గారి గది' వంటి హారర్ కామెడీ చిత్రంతో హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో 'జత కలిసే' 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' వంటి రెండు చిత్రాల్లో నటించాడు. ఇక కింగ్ నాగార్జున - సమంత అక్కినేని ప్రధాన పాత్రలతో తెరకెక్కిన 'రాజు గారి గది 2' చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు. చివరిగా తన అన్న డైరెక్ట్ చేసిన 'రాజు గారి గది 3' చిత్రంతో అలరించాడు. ఇప్పుడు #AB7 సినిమాతో వస్తున్న అశ్విన్ బాబు కు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.