Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఎ1 ఎక్స్‌ ప్రెస్

By:  Tupaki Desk   |   5 March 2021 1:10 PM GMT
మూవీ రివ్యూ : ఎ1 ఎక్స్‌ ప్రెస్
X
చిత్రం: ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’

నటీనటులు: సందీప్ కిషన్-లావణ్య త్రిపాఠి-రావు రమేష్-మురళీ శర్మ-సత్య-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ-ఖయ్యూం-మహేష్ విట్టా-దివి-పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: హిప్‌ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: కవిన్ రాజ్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్-అభిషేక్ అగర్వాల్-సందీప్ కిషన్-దయ పన్నెం
దర్శకత్వం: డెన్నిస్ జీవన్ కానుకొలను

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో తనపై భారీగా అంచనాలు పెంచిన యువ నటుడు సందీప్ కిషన్.. ఆ తర్వాత ఇప్పటిదాకా ఆ స్థాయి విజయాన్నందుకోలేదు. మధ్య మధ్యలో ఓ మోస్తరు సినిమాలు వచ్చినప్పటికీ.. మళ్లీ ఒక పెద్ద బ్రేక్ కోసం అతడి ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. సందీప్ 25వ సినిమాగా తెరకెక్కిన ‘ఎ1 ఎక్స్‌ ప్రెస్’తో అయినా అతను కోరుకున్న విజయం దక్కేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

సందీప్ (సందీప్ కిషన్).. హాకీ ప్లేయర్ అయిన లావణ్య (లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి కోసం యానాంలోని తన మావయ్య ఇంటికొస్తాడు. నెమ్మదిగా ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించుతాడు. లావణ్య ఆట పరంగా కష్టం వస్తే తనకు సాయం చేసే క్రమంలో సందీప్ కూడా హాకీ క్రీడాకారుడే అన్న విషయం బయటపడుతుంది. అండర్-21 స్థాయిలో అతను ఇండియన్ కెప్టెన్ అని తెలుస్తుంది. ఓ బలమైన కారణంతో ఆటను మధ్యలో వదిలేసిన అతను.. మళ్లీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తిరిగి హాకీ స్టిక్ పట్టుకోవాల్సి వస్తుంది. గతంలో అతనెందుకు ఆట వదిలేశాడు.. మళ్లీ ఎందుకు ఆటలోకి వచ్చాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఆటకు ఓ బలమైన ఎమోషన్ జోడించి.. పకడ్బందీగా సినిమా తీస్తే గొప్ప ఆదరణ దక్కుతుందని.. హిందీ ‘లగాన్’ నుంచి తెలుగు ‘జెర్సీ’ వరకు చాలా సినిమాలు రుజువు చేశాయి. ఒక పెద్ద సమస్యకు.. ఆటతో గెలుపుకి ముడిపెట్టి ప్రేక్షకుల్లో భావోద్వేగాలు తట్టి లేపితే సినిమా పాస్ అయిపోతుంది. అయితే ఆ సమస్యను ప్రేక్షకులు రిలేట్ చేసుకోవాలి. అలాగే ఆ ఆటను ఉత్కంఠభరిత రీతిలో తెరపై ప్రెజెంట్ చేయాలి. ఈ విషయంలో ‘ఎ1 ఎక్స్ ప్రెస్’కు మంచి సెటప్పే కుదిరింది. తెలుగులో ఇంత వరకు చూడని హాకీ ఆట నేపథ్యంలో నడవడం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’కు ప్లస్. గేమ్ తో ముడిపడ్డ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి. పైన చెప్పుకున్నట్లు ఇందులోని ‘ఇష్యూ’ కూడా ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలాగే ఉంది. కానీ అన్ని విషయాలూ పైపైన డీల్ చేయడం.. కొత్తదనం కొరవడటం.. ప్రేక్షకులను కదిలించే.. వారిలో ఉద్వేగాల్ని తట్టి లేపే స్థాయిలో కథనం సాగకపోవడం ప్రతికూలంగా మారాయి. మంచి సెటప్ కుదిరినా కూడా ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ ఒక స్థాయిని మించి అలరించలేకపోయింది. స్పోర్ట్స్ డ్రామాలు సాధ్యమైనంత వరకు రియలిస్టిగ్గా ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ను కమర్షియల్ స్టయిల్లో.. బాగా లౌడ్ గా ప్రెజెంట్ చేయడం మైనస్.

తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాల్లో జెర్సీ, సై సినిమాలను చెప్పుకోవచ్చు. కథ పరంగా చూస్తే ఆ రెండింటి కలయికలా అనిపిస్తుంది ‘ఎ1 ఎక్స్ ప్రెస్’. ‘సై’లో మాదిరే ఇక్కడా ఒక గ్రౌండును కాపాడుకోవడానికి మ్యాచ్ గెలవడం అన్నది టార్గెట్. ఇక ‘జెర్సీ’ సినిమాలో హీరో తనకెంతో ఇష్టమైన ఆటను ప్రత్యేక పరిస్థితుల్లో విడిచిపెడితే.. ఇక్కడ తన ప్రాణ మిత్రుడికి జరిగిన అన్యాయం తట్టుకోలేక ఆ ఆటకు దూరమవుతాడు హీరో. తర్వాత ఒక కాజ్ కోసమని మళ్లీ ఆటలో అడుగు పెడతాడు. ఐతే పై రెండు సినిమాల్లో మాదిరి ‘ఎ1 ఎక్స్ ప్రెస్’లో ఎమోషన్ క్యారీ అవ్వలేదు. అలాగే ఆటను కూడా అనుకున్నంత ఉత్కంఠభరితంగా చూపించలేకపోయారు ఇక్కడ. ఐతే హీరోను ముందు ఒక మామూలు కుర్రాడిలా చూపించి.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో హీరో క్రికెట్ టాలెంట్ చూపించే సీన్ తరహాలో ఇందులో హీరోకు ఎలివేషన్ ఇచ్చే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ దగ్గరొచ్చే ఆ ఎపిసోడ్ కు ముందు హీరో హీరోయిన్ల పరిచయం.. ప్రేమ సన్నివేశాలతో ప్రథమార్ధాన్ని నడిపించాడు దర్శకుడు. అది మరీ గొప్పగా అనిపించదు. అలాగని బోర్ కూడా కొట్టదు. ఓ మోస్తరుగా సన్నివేశాలు నడిచిపోతాయి. ఇంటర్వెల్ దగ్గర హీరో టాలెంట్ ఏంటో చూపించే దగ్గర ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ గ్రాఫ్ పైకి లేస్తుంది.

ద్వితీయార్ధం నుంచి ‘ఎ1 ఎక్స్ ప్రెస్’కు ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ మైనస్ అయింది. హీరో మధ్యలో ఆట వదిలేశాడు అంటే ఒక బలమైన కారణం ఉంటుందని అంచనా వేస్తాం. అందుకు తగ్గట్లే ఫ్లాస్ బ్యాక్ నడుస్తుంది. ప్రియదర్శి ఎపిసోడ్ హృద్యంగా అనిపించినప్పటికీ.. ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా అయితే అనిపించదు. ఇక వర్తమానంలోకి వస్తే.. హాకీ మైదానం ఉన్నచోట హాస్పిటల్ కట్టాలనుకోవడం.. దానికి వ్యతిరేకంగా కోచ్-ఆటగాళ్లు ఎదురు తిరగడం.. మ్యాచ్ గెలిస్తే గ్రౌండ్ మీదే అన్న ఛాలెంజ్.. ఆటలోకి తిరిగి రానే రానని భీష్మించుకున్న హీరో ఈ మ్యాచ్ కోసం రంగంలోకి దిగడం.. ఇవన్నీ కూడా చాలా రొటీన్ గా అనిపించే విషయాలు. ఏ కొత్తదనం కనిపించదు. ప్రేక్షకుల్లో ఒక ఎమోషన్ తెచ్చేలా ఈ సన్నివేశాలను డీల్ చేయడంలోనూ దర్శకుడు విఫలమయ్యాడు. చివరి 20 నిమిషాల్లో హాకీ మ్యాచ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు జస్ట్ ఓకే అనిపిస్తాయి తప్ప అంత ఉత్కంఠభరితంగా లేవు. ఆ సన్నివేశాలను వాస్తవికంగా కాకుండా లౌడ్ గా ప్రెజెంట్ చేయడం స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడేవాళ్లకు రుచించకపోవచ్చు. ఓవరాల్ గా చూస్తే.. ‘ఎ1 ఎక్స్ ప్రెస్’లో కొన్ని ఆసక్తికర మూమెంట్స్ అయితే ఉన్నాయి. దీనికి మంచి సెటప్ కూడా కుదిరింది. కానీ మనం ఇప్పటికే చూసిన కొన్ని స్పోర్డ్స్ డ్రామాల స్థాయిలో అయితే ఇదే అలరించలేకపోయింది. జస్ట్ అలా టైంపాస్ చేయడానికైతే ఈ సినిమా ఓకే.

నటీనటులు:

సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ పాత్రకు సూటయ్యాడు. అతను మైదానంలో ఉన్నపుడు ఆటగాడిలాగే కనిపించాడు. ఆ మేరకు ఆటపై అవగాహన పెంచుకుని.. బాడీ మార్చుకుని.. అవసరమైన బాడీ లాంగ్వేజ్ కూడా చూపించాడు. అతడి కష్టం తెరపై కనిపిస్తుంది. సందీప్ నటన ఓకే కానీ.. ప్రతి సన్నివేశంలోనూ అవసరానికి మించి ఆత్మవిశ్వాసం చూపించడమే అతడికి బలహీనత మారిపోతోంది. దీని వల్ల నటనలో ఒక మొనాటనీ వస్తోంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్ర ఆరంభమైన తీరు చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. తర్వాత దాన్ని నామమాత్రం చేశారు. ఆమె నటన పర్వాలేదనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే లావణ్య కొంచెం ఎక్కువగా గ్లామరస్ గా కనిపించిందీ సినిమాలో. విలన్ పాత్రలో రావు రమేష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన టిపికల్ యాక్టింగ్ తో తక్కువ సన్నివేశాల్లోనే ప్రభావం చూపించాడు. కోచ్ పాత్రలో మురళీ శర్మ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణలకు స్క్రీన్ టైం తక్కువైనా తమదైన ముద్ర వేయగలిగారు. సత్య.. మహేష్ విట్టా.. పోసాని కృష్ణమురళి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

హిప్ హాప్ తమిళ సంగీతం తమిళ వెర్షన్ కు సరిపోయిందేమో కానీ.. తెలుగులో మాత్రం తేడాగా అనిపిస్తుంది. పాటల్లో.. బ్యాగ్రౌండ్ స్కోర్‌లో అరవ వాసనల వల్ల.. తమిళ సినిమా చూస్తున్న ఫీలింగే కలిగిస్తుంది. చాలా చోట్ల నేపథ్య సంగీతం.. బ్యాగ్రౌండ్ సాంగ్స్ మరీ లౌడ్ గా అనిపించి.. చికాకు పెడతాయి. అమిగో.. సింగిల్ కింగులం పాటలు ఓకే బాగానే అనిపిస్తాయి. కవిన్ రాజ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. విజువల్స్ చాలా చోట్ల ఔట్ ఆఫ్ ఫోకస్ అనిపిస్తాయి. గేమ్ కు సంబంధించిన సన్నివేశాల్లో ఛాయాగ్రహణం ఉండాల్సిన స్థాయిలో లేదు. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలనుకు యావరేజ్ మార్కులు పడతాయి. చాలా వరకు మాతృకనే ఫాలో అయిన అతను.. మన నేటివిటీకి తగ్గట్లుగా ఈ కథను నరేట్ చేయడంలో విజయవంతం కాలేకపోయాడు. మరీ తమిళ వాసనలు గుప్పుమనేలా సినిమాను డీల్ చేయడం ‘ఎ1 ఎక్స్‌ ప్రెస్’కు ప్రతికూలంగా మారింది.

చివరగా: ఎ1 ఎక్స్‌ ప్రెస్.. స్పీడు తగ్గింది బాస్

రేటింగ్- 2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre