సాంగ్ బడ్జెట్ తో మిడ్ రేంజ్ సినిమా తీయొచ్చు

Wed Jul 06 2022 15:00:01 GMT+0530 (IST)

A film can be made with a song budget

శంకర్ అంటేనే భారీతనం. విజువల్ రిచ్ యాంబియెన్స్.. అల్ట్రా స్టైలిష్ అవతార్ లతో అతడు చేసే ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. వీటి కోసమే అతడు కోట్లాది రూపాయలు ఖర్చు చేయిస్తారు. భారీ సెట్లు వేయించి భారీ కాస్ట్యూమ్స్ ని ఇంపోర్ట్ చేయించి మేకప్ తో ప్రయోగాలు చేయిస్తూ క్రియేటివ్ ప్రపంచపు పోకడల్ని మార్చిన గురుడు ది గ్రేట్ శంకర్. అతడు అడగాలే కానీ ఎంత బడ్జెట్ ఇచ్చేందుకైనా నిర్మాతలు వెనకాడరు.కెరీర్ తొలి సినిమా ది జెంటిల్ మేన్ మొదలు ఇప్పటివరకూ తెరకెక్కించిన ప్రతి సినిమాలో భారీతనం నిండిన పాటలు ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అందులో నర్తించిన తారలకు కూడా అంతే గొప్ప పేరొచ్చింది. బ్రాండ్ ఇమేజ్ పెరిగింది.

ఇప్పుడు ఆర్.సి 15 కోసం శంకర్ భారీ ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటికే కాలేజ్ సాంగ్ చిత్రీకరణ కోసం ప్రధానతారాగణంతో పాటు.. 1000 మందికి పైగా డ్యాన్సర్లతో ఒక ప్రత్యేక కాలేజ్ పాటను చిత్రీకరిస్తున్నారు.

బోయ్స్ లో కాలేజ్ సాంగ్ తరహాలోనే ఇది కూడా అలరిస్తుందని అంతే భారీతనం కలిగి ఉంటుందని కూడా టాక్ వినిపించింది. చరణ్ త్వరలో 1200 మంది పైగా ఫైటర్లతో హెవీ డ్యూటీ యాక్షన్ సీన్ చిత్రీకరణలోనూ పాల్గొననున్నాడని తెలిసింది.  

నిజానికి శంకర్ ఒక సాంగ్ షూట్ కోసం పెట్టే బడ్జెట్ తో ఒక మిడ్ రేంజ్ హీరోతో సినిమా తీసేయొచ్చు! అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక చిన్న మూవీ తీసేంత ఖర్చును ఒక్కో పాటకు ఖర్చు చేయడం అంటే మాటలు కాదు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కోసం కూడా ఒక రేంజులో బడ్జెట్ పెట్టిస్తున్నారన్న టాక్ ఉంది.  అయితే ఇలాంటి కండీషన్ లో పని చేయాలంటే నిర్మాతలకు కూడా గట్స్ ఉండాలి. కోట్లాది రూపాయల సొమ్ముల్ని తెచ్చి సాహసాలు చేయాల్సి  ఉంటుంది.

రామ్ చరణ్ -శంకర్ లతో  RC15 కోసం తెలుగు సినిమా అగ్ర నిర్మాత దిల్ రాజు పెట్టుబడుల్ని సమకూరుస్తున్నారు.  ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా చిత్రీకరణను ముగించనున్నారని సమాచారం. ఈ సినిమా 2023 వేసవిలో వస్తుందా లేదా? అన్నది చూడాలి.