2028నాటికి 5 అవతార్ లు.. 2022 డిసెంబర్ లో అవతార్-2

Mon Sep 13 2021 21:00:01 GMT+0530 (IST)

5 Avatars by 2028 Avatar 2 in December 2022

హాలీవుడ్ స్టార్ మేకర్ జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన  విజువల్ వండర్ `అవతార్` గురించి చెప్పాల్సిన పనిలేదు. 2డి -3డిలో విడుదలై సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా అవతార్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అన్ని  దేశాల్లోనూ అవతార్ సంచలన విజయం  సాధించి బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయల వసూళ్ల వర్షం కురిపించింది. అవతార్ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అవతార్ -2ని 2020  జూన్ లో  రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ కరోనా పాండమిక్ కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇప్పటివరకూ అవతార్ -2 ఎనిమిది సార్లు వాయిదా పడినట్లు  తెలుస్తోంది.2020 కంటే ముందే కొన్ని తేదీలను ప్రకటించి వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా  మరో కొత్త డేట్ ని  ప్రకటించారు.  2022  డిసెంబర్ 16న అవతార్ 2ని రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. అలాగే `అవతార్ -3` ని 2024 డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. అవతార్ -4 రిలీజ్ కి సంబంధించి కూడా ప్రకటనను ఇచ్చారు. `అవతార్ -4` ని 2026 డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. అలాగే  అవతార్ చివరి భాగం `అవతార్ -5` 2028 డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో అవతార్ ప్రాంచైజీ పూర్తవుతుంది. షూటింగ్  మాత్రం బ్రేక్ లేకుండా కొనసాగుతోంది. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ అవతార్ -2  పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

అవతార్ ప్రాంచైజీలు  అన్నింటిని కూడా  డిసెంబర్  లోనే రిలీజ్ అయ్యేలా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో  భాగం రిలీజ్ కి రెండేళ్లు చొప్పున గ్యాప్ తీసుకుంటున్నారు. ఇందులో అవతార్ లో నటించిన నటీనటులతో పాటు కొత్తవాళ్లు భాగమవుతున్నారు.  కేట్ విన్ల్సెట్.. విన్ డీజిల్ లాంటి కొత్త యాడ్ అవుతున్నారు. మొదటి భాగాన్ని పండోరా గ్రహంపై చూపించారు. ఈ నేపథ్యంలో రెండవ  భాగం పండోర గ్రహంలోని నీటి అడుగున కథ సాగనుంది. ఈ గ్రహం మీద మరో కొత్త తెగను పరిచయం చేయనున్నారు.

ఇప్పటికీ వసూళ్లలో అవతార్ నం.1

అవతార్ ఇటీవలే చైనాలో తిరిగి విడుదలై అసాధారణ వసూళ్లతో సంచలనం సృష్టించింది. అంతేకాదు.. వరల్డ్ నంబర్ వన్ గా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. అవతార్ చిత్రం ఒక దశాబ్దానికి పైగా ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల్లో నిలిచి ఉండగా 2019లో రిలీజైన ఎవెంజర్స్ -ఎండ్ గేమ్ ఆ రికార్డుల్ని బ్రేక్ చేసి నంబర్ వన్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా  2.7897 బిలియన్ల వసూళ్లతో అవతార్ సంచలనం సృష్టిస్తే.. `ఎండ్ గేమ్` వరల్డ్ వైడ్ 2.7902 బిలియన్ డాలర్లు సంపాదించి ఆ రికార్డును బ్రేక్ చేసింది.

తాజాగా అవతార్ చైనాలో  రీ-రిలీజ్ తో 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి తిరిగి మొదటి స్థానానికి చేరుకుందని ఎవెంజర్స్ రికార్డును బ్రేక్ చేసిందని నిర్మాతలు ప్రకటించడం సంచలనమైంది.  ఇదే విషయాన్ని మార్వెల్ స్టూడియోస్ -రస్సో బ్రదర్స్ సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసుకోవడం ఆసక్తికరం. అవతార్ తిరిగి అగ్రస్థానాన్ని కైవశం చేసుకోవడంపై మార్వెల్ స్టూడియోస్ కూడా స్పందిస్తూ ``బాక్సాఫీస్ కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు జేమ్స్ కామెరాన్.. జాన్ లాండౌ ఇతర టీమ్ అందరికీ అభినందనలు! మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం..`` అని పేర్కొంది. డిసెంబర్ 2022 నుండి డిసెంబర్ 2028 వరకు నాలుగు అవతార్ సీక్వెల్స్ ను విడుదల చేసేందుకు కామెరూన్ టీమ్ ప్లాన్ చేసింది.