Begin typing your search above and press return to search.

40 ఏళ్ల సాగర సంగమం.. ఈ విశేషాలు తెలుసా..?

By:  Tupaki Desk   |   2 Jun 2023 7:21 PM GMT
40 ఏళ్ల సాగర సంగమం.. ఈ విశేషాలు తెలుసా..?
X
ఎన్ని తరాలు మారిన సరే ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది ఈ సినిమా.. 40 ఏళ్ల క్రితం సినిమా గురించి ఎప్పుడు తలుచుకున్నా ఒకే రకమైన భావన.. అదే కళాతపస్వి దర్శకత్వం వహించిన అద్భుత దృశ్య కావ్యం సాగర సంగమం. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించిన సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్, జయప్రద నటించారు. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపించేలా విశేషాలు ఉన్నాయి.

సినిమాలో కమల్ హాసన్ నటన ఇళయరాజా సంగీతం కె విశ్వనాథ్ దర్శకత్వం అన్ని అలా సమపాళ్లలో కుదిరాయి. ఈ సినిమాకు జంధ్యాల మాటలు మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఇళయరాజా సంగీతానికి వేటూరి సాహిత్యం సంగీత ప్రియులను అలరించాయి. సాగర సంగమం సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప సినిమా.

జూన్ 3 1983లో ఈ సినిమా విడుదలైంది. తమిళంలో సలంగై ఒలి.. తెలుగులో సాగర సంగమం.. మలయాళంలో సాగర సంగమం గా ఒకే రోజు రిలీజైంది. నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎంతోమంది మనసుల్లో నిలిచిపోయిన సినిమా.

అప్పటికే శంకరాభరణం సినిమా చేసిన కె విశ్వనాథ్ ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్ లో వచ్చిన మరో అద్భుత కళా ఖండం సాగర సంగమం. 100 ఏళ్ల భారతీయ సినిమా సందర్భంగా CNN IBN లిస్ట్ ఆఫ్ 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ ఆఫ్ ఆల్ టైం లో ఇది 13వ స్థానం దక్కించుకుంది. ఇక్కడ మాత్రమే కాదు రష్యన్ భాషలో కూడా అనువదించబడి ఆ టైం లోనే అక్కడ 400 థియేటర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకున్న తొలి తెలుగు సినిమా సాగర సంగమం.

కేవలం శతదినోత్సవమే కాదు ఎన్నో కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంది సాగర్ సంగమం. బెంగళూరులో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శించబడ్డ సినిమా సాగర సంగమం. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎంతోమంది క్లాసికల్ డాన్స్ మీద ఆసక్తి పెంచుకున్నారు.

ఎన్నో సినిమాల్లో నటించిన కమల్ హాసన్ తన మనసుకి నచ్చిన సినిమాల్లో సాగర సంగమం పేరు ముందు చెబుతారు. ఈ సినిమాకు సంగీతం అందించినందుకు ఇళయరాజాకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో పాటలు పాడినందుకు గాను ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం కి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. తెలుగు సినిమాల్లో ఆల్ టైం క్లాసిక్ గా చెప్పుకునే సినిమాల్లో ఒకటిగా సాగర్ సంగమం ఉంటుంది.

ఈ సినిమా శతదినోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు రాజ్ కపూర్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్ వచ్చారు. 40 ఏళ్లు కాదు మరో 100 ఏళ్ల తర్వాత కూడా సాగర సంగమం గురించి ఎప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.