మళ్ళీ బిజీ అవుతున్న 24 క్రాఫ్ట్స్..!

Wed Jun 23 2021 13:03:38 GMT+0530 (IST)

24 Crafts getting busy again

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ లో పరిస్థితులు సాదారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగులు తిరిగి ప్రారంభమయ్యాయి. 'ఆర్.ఆర్.ఆర్' వంటి భారీ చిత్రాలను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లారు. రాబోయే రెండు వారాల్లో అన్ని సినిమాల చిత్రీకరణలు స్టార్ట్ కానున్నాయి. దీంతో సినిమాపై ఆధారపడి జీవించేవారిలో సంతోషం వ్యక్తం అవుతోంది.తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఇటీవల జాయింట్ మీటింగ్ లో నిర్ణయించిన తీర్మానాలను అనుసరిస్తూ షూటింగులో పాల్గొంటున్నారు. 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారినే షూటింగ్ లకు అనుమతిస్తున్నారు. గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ముందుగా ఆ సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే కొత్త సినిమాలను స్టార్ట్ చేయకుండా.. పెండింగ్ వర్క్ ఫినిష్ చేయాలని చూస్తున్నారు.

స్టార్ హీరోలందరూ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న చిత్రాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ ను ప్రారంభించాలని చూస్తున్నారు. ఇక తెలంగాణలో థియేటర్లు తెరుచుకోడానికి పర్మిషన్ రావడంతో.. ఏపీలో కూడా అనుమతి వస్తే సినిమాల విడుదల తేదీలను ప్రకటించడానికి మేకర్స్ సమాయత్తమవుతున్నారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కు ముందు వాయిదా పడిన సినిమాలు జూలై లో రిలీజ్ డేట్లను ప్రకటించే అవకాశం ఉంది. థియేటర్ ఆక్యుపెన్సీని బట్టి పెద్ద సినిమాలు కూడా క్యూ కట్టనున్నాయి.