హీరోహీరోయిన్ల దాంపత్యానికి పన్నెండేళ్లు పూర్తి!

Sat Apr 20 2019 20:12:56 GMT+0530 (IST)

12 Years Aishwarya Rai and Abhishek Bachchan

ఏప్రిల్ 20 వ తేదీతో అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ ల దాంపత్యం పన్నెండు సంవత్సరాలను పూర్తి చేసుకుంది! 2007 లో ఈ జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చూస్తుండగానే వీళ్ల దాంపత్యం ఒక పుష్కరాన్ని పూర్తి చేసుకుంది.వివాహానికి మునుపు వీరి గురించి ఉన్న క్రేజ్ - వీరి గురించి ఉన్న చర్చలు - వీరి ప్రేమ కథలు ఎంతో ఆసక్తిదాయకమైనవి అని వేరే చెప్పనక్కర్లేదు.

బాలీవుడ్ హీరోలతోనే ప్రేమాయణాలను నడిపింది ఐశ్వర్య. సల్మాన్ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగారామె. ఆ ప్రేమ కథ అలా ముగిశాకా వివేక్ ఒబెరాయ్ తో కొంత కాలం ఆమె ప్రేమలో గడిపింది. చివరకు అభిషేక్ ను వివాహం చేసుకున్నారామె.

ఇక అభిషేక్ బచ్చన్ కు మరీ పెద్ద ప్రేమకథలు లేవు కానీ - అతడికి కరిష్మా కపూర్ తో ముందుగా నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థం పెళ్లికి పోకుండానే బ్రేకప్  అయ్యారు. అయితే అప్పట్లో అభిషేక్ బచ్చన్ సినిమా హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడ్డాడు. సరైన హిట్స్ దక్కలేదు. ఇప్పుడు కూడా అభిషేక్ కు సరైన సినిమాల విజయాలు లేవు. అడపాదడపా సినిమాలు చేస్తూ సాగుతున్నాడాయన.

ఇక ఈ పన్నెండేళ్ల దాంపత్యంలో ఈ దంపతులకు ఒక పాప పుట్టింది. ఆరాధ్య గా అపురూపంగా చూసుకుంటున్నారు. కొంత కాలం కిందట నుంచి ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సారి వివాహ వార్షికోత్సవాన్ని ఐష్ అభిషేక్ లు మాల్దీవుల్లో జరుపుకున్నారు.