జారిన మెట్టుకు దండం పెట్టు !
మెట్టూ మెట్టూ ఎక్కితేనే ఎవరెస్ట్ శిఖరం అయినా అందుతుంది. ఒక్కో వాన చుక్క మహా నీటి ప్రవాహం అయినట్లుగా ఒక్కో అడుగూ గమ్యం వైపు నడిపిస్తుంది. విజయాలను అందిస్తుంది.
By: Satya P | 6 April 2026 1:30 AM ISTమెట్టూ మెట్టూ ఎక్కితేనే ఎవరెస్ట్ శిఖరం అయినా అందుతుంది. ఒక్కో వాన చుక్క మహా నీటి ప్రవాహం అయినట్లుగా ఒక్కో అడుగూ గమ్యం వైపు నడిపిస్తుంది. విజయాలను అందిస్తుంది. అయితే ఏ విజయం అయినా అంత సులువుగా దక్కదు, ఈజీగా వచ్చే సక్సెస్ కలకాలం నిలువదు, ఇదే జీవిత సత్యం. అందుకే నిదానంగా ఎదిగిన వారే జీవితంలో అందలం మీద అధిక కాలం కూర్చో గలుగుతారు. ఇక విజయం వైపు సాగే పయనంలో ప్రతీ మెట్టూ కీలకమే. అయితే ఇందులో పైకి దారి చూపించే మెట్లు ఎన్ని అన్నది వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా అనుకునే కాలు పెడితే అన్ని మెట్లూ ఎగబాకేలా చేయవు. దిగ దోసేవే ఎక్కువగా ఉండవచ్చు. ఆ జారుడు మెట్లే నీవేమిటో చెబుతాయి. సహనానికి పరీక్ష పెడతాయి. సవాలక్ష సవాళ్ళను ముందుకు తెచ్చి జావాబు చెప్పమంటాయి.
జారిపోతూనే ఉంటే :
ఇక ఎక్కే మెట్లూ దిగే మెట్లూ ఇదేనా జీవితం అనుకోవద్దు. నిచ్చెన అందుకోవాలంటే ఉజ్వలమైన జీవితం చూడాలంటే ఈ మెట్లే ఆధారం. అందుకే ప్రతీ మెట్టూ కీలకం. ఇంకా చెప్పాలంటే పైకి దోవిచ్చే మెట్టు కంటే కిందకి దిగలాగే మెట్టే అసలైన పాఠం చెబుతుంది. దానిని నిరసనగా చూడొద్దు, విసుగు అసలే చెందవద్దు. ఎంతలా జారితే అంతలా కసి పెంచుకోవాల్సి. పట్టుదల పెరగాలి. అదే జీవిత లక్ష్యాన్ని మరింత బలంగా ఢీ కొట్టేలా ఉండాలి.
సిసలైన గురువుగా :
జారుడు మెట్టు అసలైన సిసలైన గురువు. అది చెప్పే పాఠం జీవితంలో ఎవరూ చెప్పరు, కదలని మెదలని నిశ్చలమైన జారుడు మెట్టు చెప్పేదేంటి అని ప్రశ్నించకు. సావధానంగా పరికించి చూస్తే వాస్తవం బోధపడుతుంది. నిన్ను నీవు సాన బట్టుకోవడానికి రాటు దేలడానికి అవకాశం అక్కడే దొరుకుతుంది. జారే మెట్టు నీ మానసిక శారీరక నిబ్బరాన్ని నిలదీస్తుంది. నీ ప్రతిభను మరింతగా రాణింపునకు తెస్తుంది. అందుకే జారే మెట్టుని తలచుకుని మరీ చేయాల్సిన పని తిరిగి మొదలెట్టాలి.
అక్కడే బలమంతా :
మొదటి అడుగులోనే బలం ఏంటో తెలుసుంది. కింద మెట్టే శక్తి ఏమిటో చాటి చెబుతుంది. లక్ష్యమెంత దూరం కానీ నీ పంతం ఎంత అన్నదే అది చూస్తుంది. నీవు ఉన్నత స్థానానికి చేరుకోగలవా లేవా అన్నది అక్కడే చెప్పేస్తుంది. ఎందరో జారుడు మెట్ల దగ్గరనే ఆగిపోయి ఫెయిల్యూస్ స్టోరీస్ చెప్పుకున్నారు. కానీ అంతకు మించి మరెందరో జారిన మెట్టు నుంచే శిఖరాలకు ఎదిగి లోకానికి సక్సెస్ స్టోరీలు వినిపించారు. తాము ఒక స్పూర్తిగా నిలిచారు.
మొక్కి మరీ సాగాల్సిందే :
జారుడు మెట్టుకు మొక్కాలి, నీవే దిక్కు అంటూ దండం పెట్టి మరీ గమ్యం వైపుగా ధీమాగా అడుగులు వేయాలి. ఒకసారి కాదు ఎన్ని సార్లు పడినా జారుడు మెట్టు ఆదుకుంటుంది. మళ్ళీ స్టార్ట్ చేయమంటుంది. నేర్చిన పాఠంలో తెలుసుకున్న గుణపాఠంలో ఎక్కడ తప్పు ఉందని సర్దుకోమంటుంది అలా అంతా సంసిద్ధమై వేగంగా ముందుకు సాగిపోయాక అదే జారుడు మెట్టు ఎంతో దూరం అవుతుంది. అయినా సరే దానిని ఎప్పటికీ మరచిపోవద్దు. ఆది గురువు లాంటి జారుడు మెట్టుని సదా తలుస్తూ కొలుస్తూ ఉంటే నీ విజయానికి అసలైన అర్ధం, పరమార్ధం. ప్రతీ విజేత జీవితంలో జారుడు మెట్లు ఎన్నో ఉంటాయి. కొందరికి పదులు, మరి కొందరికి వందలు వేలు. అయితే అక్కడే పడిపోకుండా లేచిన కడలి తరంగంలా దూసుకుని పోయే వారికే జారుడు మెట్టు దీవిస్తుంది. వారి ఎదుగుదలను చూసి సంతోషిస్తుంది. వారితో పాటు తానూ తరిస్తుంది.
