ఆత్మహత్య చేసుకునే మానవేతర ప్రాణుల వివరాలు, కారణాలు ఇవిగో!
క్షణికావేశంలోనో.. భరించలేని బాధలోనో.. నిరాశ నిస్పృహలోనో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
By: Tupaki Desk | 14 Sep 2024 2:30 AM GMTఆత్మహత్య ఏమాత్రం సరైన ఆలోచన కాదు.. ఏమాత్రం సహేతుకం కాదు. అది ధర్మ ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ నేరమే! ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తుంటే వారికి కౌన్సిలింగ్ సెంట్రస్ ఉంటాయి. క్షణికావేశంలోనో.. భరించలేని బాధలోనో.. నిరాశ నిస్పృహలోనో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
అయితే.. అలాంటి ఆలోచన చేసేది కేవలం మనిషే కాదు.. ఆ జాబితాలో చాలా రకాల ప్రాణులే ఉన్నాయని అంటున్నాయి పలు అధ్యయనాలు! ఈ విషయంలో నేలపై నడిచేవి, నీటిలో బ్రతికేవి చాలా ప్రాణులే ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆత్మహత్యలకు పాల్పడే మానవేతర ప్రాణుల వివరాలు అందుకు గల కారణాలను ఓసారి చూద్దాం...!
అవును... ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా అంటే... ‘అంత కష్టం ఏమి వచ్చిందనేది’ వారికి ఎదురయ్యే ప్రశ్న. ‘నా కష్టాలు నీకేం తెలుసు’ అనేది అటు నుంచి వచ్చే సమాధానం. అయితే ఈ విషయంలో మనిషే కాదు.. మనిషి అత్యంత సన్నిహితమైన జంతువుగా పేరున్న కుక్కలు కూడా ఈ జాబితాలో ప్రధానమైనవని అంటున్నారు పరిశీలకులు!
ఒత్తిడికి, తీవ్ర నిరాశకూ గురైనప్పుడు కుక్కలు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేస్తాయంట. ఈ సమయంలో వాటిని అవే గాయపరుచుకోవడం.. గోడలు ఎక్కి దూకడం.. పూర్తి నైరాశ్యంలో ఉన్నట్లుగా ఒకే చోట పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తుండటం వంటికి కుక్కలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ముందస్తు లక్షణాలు అని అంటున్నారు.
ఇక పందులు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైన పరిస్థితి! ఈ క్రమంలో అవి బలమైన గోడలను, రాళ్లను తలతో బలంగా ఢీకొట్టుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తాయంట. ఇదే క్రమంలో ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలుకలు, పిల్లులు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాయంట.
ఇలా భూమిపై ఉండే మనుషులు, ఇతర ప్రాణులతో పాటు నీటిలో జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు, చేపలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. తీవ్ర ఒత్తిడి కారణంగా.. ఉద్దేశ్యపూర్వకంగా ఒడ్డుకు కొట్టుకురావడం.. లేదా, బలవంతంగా ఊపిరి బిగబట్టుకుని ఉండిపోవడం వంటి చర్యలతో ఈ సముద్ర జీవులు ఆత్మహత్య చేసుకుంటాయని చెబుతున్నారు.