Begin typing your search above and press return to search.

భారత్‌లో రాష్ట్రాల సగటు ఆయుష్షు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి?

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. తెలంగాణలో సగటు ఆయుష్షు 70.8 ఏళ్లుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 70.7 ఏళ్లుగా నమోదైంది.

By:  Madhu Reddy   |   20 March 2026 7:00 PM IST
భారత్‌లో రాష్ట్రాల సగటు ఆయుష్షు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి?
X

మనం ఎంత సంపాదించాము అనేదాని కంటే.. ఎంత కాలం ఆరోగ్యంగా బ్రతికామనేదే ముఖ్యం.. తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన 'సగటు ఆయుష్షు' గణాంకాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ లిస్ట్‌లో కేరళ అగ్రస్థానంలో నిలవగా, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? ఏయే రాష్ట్రాల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి? మీ రాష్ట్రం ఈ జాబితాలో ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వివరాలు చూసేయండి..

కేరళ టాప్.. హిమాచల్ భేష్:

భారతదేశంలో అత్యధిక సగటు ఆయుష్షు కలిగిన రాష్ట్రంగా కేరళ 75.1 ఏళ్లతో మొదటి స్థానంలో నిలిచింది. అక్కడి మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, అక్షరాస్యత దీనికి ప్రధాన కారణాలు. ఆ తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ (74.4), జమ్మూ కాశ్మీర్ (74.4) ఉండటం విశేషం. చల్లని వాతావరణం, కాలుష్యం తక్కువగా ఉండటం కూడా ఈ కొండ ప్రాంత ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి సహకరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కూడా 74.2 ఏళ్లతో టాప్ ర్యాంకుల్లోనే ఉండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?:

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. తెలంగాణలో సగటు ఆయుష్షు 70.8 ఏళ్లుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 70.7 ఏళ్లుగా నమోదైంది. అంటే జాతీయ సగటుకు దగ్గరగా మనం ఉన్నామన్నమాట. తమిళనాడు (73.4), మహారాష్ట్ర (72.8) వంటి పొరుగు రాష్ట్రాలు మనకంటే కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మన ఆయుష్షు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వెనుకబడిన రాష్ట్రాల్లో అసలు కారణాలు:

ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ 64.6 ఏళ్లతో అందరికంటే చివరన నిలిచింది. మధ్యప్రదేశ్ (67.6), ఉత్తరప్రదేశ్ (68.0) వంటి రాష్ట్రాలు కూడా తక్కువ ఆయుష్షు కలిగిన జాబితాలో ఉన్నాయి. ఇక్కడ మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉండటం, పోషకాహార లోపం మరియు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందకపోవడం వంటివి సగటు ఆయుష్షు తగ్గడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్నా, ఆరోగ్య రంగంలో ఈ రాష్ట్రాలు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

ఆయుష్షు పెరగాలంటే ఏం చేయాలి?:

కేవలం ప్రభుత్వం ఇచ్చే డేటా మాత్రమే కాదు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాలు 70 ఏళ్ల మార్కు వద్ద ఉన్నాయి. మెరుగైన వైద్యం అందరికీ అందుబాటులోకి రావడం, స్వచ్ఛమైన తాగునీరు, కాలుష్య నియంత్రణ వంటివి ప్రజల ఆయుష్షును పెంచుతాయి. బ్రతికే రోజుల్లో కూడా రాష్ట్రాల మధ్య ఈ పోటీ ఆరోగ్యకరమైనదే! ఏ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందో, ఆ రాష్ట్ర ప్రజలు అంత ఎక్కువ కాలం చిరునవ్వుతో జీవిస్తారు అన్నది నిపుణుల మాట.