భారత్ లో పెరుగుతున్న వివాహేతర సంబంధాలకు ఇవిగో కారణాలు!
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 9 Jan 2025 7:30 AM GMTఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ విషయంలో వయసుతో సంబంధం లేకుండా.. పెళ్లై ఏడాది కూడా కాకుండానే కొంతమంది ఈ దిశగా అడుగులు వేస్తుంటే.. పాతిక ముప్పై ఏళ్లు కాపురం చేసినవారు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. దీనికి ఒక్కటి కాదు.. ఎన్నో కారణాలున్నాయని చెబుతున్నారు.
అవును... వివాహ బంధం అంటేనే నమ్మకంతో కూడుకున్న రెండు జీవితాల ఉమ్మడి ప్రయాణం! ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటై.. బ్రతికి ఉన్నంత కాలం నమ్మకంగా, ఒకరికి ఒకరు తోడుగా కలిసి ఉండాలనుకుని చేసుకునే ప్రమాణం, చేసే ప్రయాణం! అయితే.. ఈ ప్రమాణం మధ్యలోనే బ్రేక్ చేసేవారు, ఆ ప్రయాణం మధ్యలోనే ముగించేసేవారు కొందరైతే.. కలిసి ప్రయాణిస్తూనే పక్క దారులు తొక్కేవారు మరికొంతమంది!
ఈ క్రమంలో.. రోజు రోజుకీ పెరుగుతున్న ఈ వివాహేతర సంబంధాలకు పలు రకాల కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. పైగా గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ తరహా సంస్కృతి జడలు విచ్చుతుందని చెబుతున్నారు. అందుకు పలు రకాల కారణాలను తెరపైకి తెస్తున్నారు. అందులో.. ఆర్థిక పరమైన, శారీరక పరమైన, మానసిక పరమైన కారణాలతో పాటు కొత్తొకవింత అనే కారణమూ ఉండటం గమనార్హం.
* సాధారణంగా వివాహేతర సంబంధాలు పెరగడంలో ఆర్థిక సమస్యలు ప్రధాన భూమిక పోషిస్తుంటాయని చెబుతుంటారు. దాంపత్య జీవితంలో ఆర్థిక సమస్యలు తీవ్ర ఒత్తిడి కలిగించే వేళ.. దంపతుల మధ్య అటు మానసికంగానూ, ఇటు శారీరకంగానూ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో ఆ సమస్య నుంచి బయటపడటం కోసం చాలా మంది ఈ తరహా సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభిస్తారని చెబుతున్నారు.
* ఇలా ఆర్థిక సమస్యల కారణంగా వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారు కొందరైతే... జీవిత భాగస్వామితో అటు శారీరక, ఇటు మానసిక అవసరాలు తీరకపోవడం.. అందులో సంతృప్తి పొందకపోవడంతో ఇతర వ్యక్తులను ఆశ్రయిస్తారని.. ఈ తరహా వివాహేతర సంబంధాలు ఇటీవలకాలంలో ఎక్కువవుతున్నాయని అంటున్నారు. ఎమోషనల్ కనెక్టివిటీ లేని బంధాలతోనే ఈ సమస్య అని చెబుతున్నారు.
* ఇదే క్రమంలో... ఒకరిపై ఒకరికి ఇష్టం కంటే ఎక్కువగా నమ్మకం, ఒకరిపై ఒకరికి గౌరవమే పునాధులుగా ఏర్పడే వివాహ బంధాల్లో కాల క్రమేనా.. ఆ నమ్మకం అనేది సన్నగిల్లడం వల్ల భాగస్వామిపై అనుమానం పెరుగుతుందని.. దీంతో.. టిట్ ఫర్ టేట్ అన్నట్లుగా వారి వారి భాగస్వాములూ మరో ఆప్షన్ ఎంచుకుంటున్నారని.. ఇవన్నీ ఇలా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయని అంటున్నారు.
* వీటికి తోడు నేటి సమాజంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వంటివి విపరీతంగా విస్తరించడం కూడా కొత్త పరిచయాలకు కారణాలవుతున్నాయని.. ఫలితంగా ఆన్ లైన్ పరిచయాలు, చాటింగ్ లు, ఆ తర్వాత డేటింగులు, ఆనాక మీటింగ్ లు వెరసి.. వివాహేతర సంబంధాలకు ఇప్పుడు మరో కీలక కారణంగా మారాయని చెబుతున్నారు.
* ఇదే క్రమంలో వివాహేతర సంబంధాలు పెరగడానికి మరో అసాధారణ కారణం... కొత్తొక వింత, పాతొక రోత అనే తరహా ఆలోచనా విధానం కూడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పండగ పూటా పాత మొగుడేనా అనే ముతక సామెతలను గుర్తు చేస్తూ.. చాలా మంది కొత్తదనం కోసం తపిస్తూ ఈ రకమైన బంధాలవైపు అడూగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో అటు మానసిక, ఇటు శారీరక అవసరాలూ ఉన్నాయని చెబుతున్నారు.