బంగారం.. డిమాండ్ తగ్గిందా? రిపోర్టులో ఏముంది?
ఎందుకుంటే.. బంగారం మీద ప్రజల్లో మోజు తగ్గినట్లు కనిపించినా ఒక విభాగంలో తప్పించి.. మిగిలిన విభాగాల్లో మాత్రం డిమాండ్ పెరిగింది.
By: Tupaki Desk | 1 Feb 2024 1:30 PM GMT2023లో బంగారం డిమాండ్ తగ్గిందా? పెరిగిందా? ఈ సూటి ప్రశ్నకు సమాధానంగా ప్రపంచ స్వర్ణ మండలి వార్షిక నివేదికలో హైలెట్ చేసిన పాయింట్లను మాత్రమే చూస్తే కనిపించే సమాధానం.. తగ్గిందని.ఇది నిజామా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకుంటే.. బంగారం మీద ప్రజల్లో మోజు తగ్గినట్లు కనిపించినా ఒక విభాగంలో తప్పించి.. మిగిలిన విభాగాల్లో మాత్రం డిమాండ్ పెరిగింది.
తాజాగా విడుదలైన నివేదికలో ఆసక్తికర అంశాలు కనిపించాయి. 2022తో పోలిస్తే 2023లో బంగారం గిరాకీ 3 శాతం తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు పలు కారణాలు కనిపిస్తాయి.తాజా నివేదిక ప్రకారం దేశీయంగా 747.5 టన్నుల బంగారానికి గిరాకీ లభించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం తక్కువ. 2022లో బంగారం గిరాకీ 774.1 టన్నులు. ధరలు పెరిగిన నేపథ్యంలో పసిడికి కాస్త గిరాకీ తగ్గినట్లుగా కనిపించింది. ఆభరణాల గిరాకీ కొంత తగ్గుముఖం పట్టింది. 2022లో 600.6 టన్నులు ఉండగా.. 2023లో మాత్రం 562.3 టన్నులు ఉంది.
అదే సమయంలో పెట్టుబడులకు బంగారం సేఫ్ అన్న విషయాన్ని ఎక్కువమంది నమ్ముతున్నారు. ఈ కారణంగా 2022లో 173.6 టన్నులు ఉంటే 2023లో 185.2 టన్నులకు పెరిగింది. బార్లు నాణేల పెట్టుబడులకు 2022లో 172 టన్నులు ఉంటే.. 2023లో 185 టన్నులుగా మారింది. మొత్తం బంగారం దిగుమతులు 2022లో 650.7 టన్నులుగా ఉంటే.. 2023లో 780.7 టన్నులుగా ఉంది. ఆర్ బీఐ కొనే బంగారంలోనూ 2022తో పోలిస్తే 2023 సగం తక్కువగా కొనుగోలు చేయటం కనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే.. దేశీయంగా బంగారం డిమాండ్ ఒక్క విభాగంలో తప్పించి.. మిగిలిన విభాగాల్లో అంతకు ముందు ఏడాది కంటే 2023లో ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది. అయితే.. అంతర్జాతీయ మార్కెట్ మాత్రం అందుకు భిన్నంగా ఉండటం కనిపిస్తుంది. నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా బంగారానికి గిరాకీ 5 శాతంతగ్గింది. 2022లో 4699 టన్నులు ఉంటే.. 2023లో మాత్రం 4448.4 టన్నులుగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఎక్ఛ్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ ల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లటమే. ఈక్విటీ మార్కెట్లు రాణించటం.. రేట్ల కోతపై అంచనాలతో పసిడి ఈటీఎఫ్ ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
మరి.. ఈ ఏడాది ఎలా ఉండనుంది? అన్న అంచనాల విషయానికి వస్తే.. ప్రస్తుత సానుకూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం గిరాకీ పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధరల్లో ఊగిసలాట లేకుంటే మాత్రం బంగారానికి గిరాకీ మరింత పెరిగి 800-900 టన్నుల శ్రేణికి చేరుకుంటుందని చెబుతున్నారు. బంగారం గిరాకీ కాస్తంత తగ్గటానికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది దిగుమతి సుంకాల పెంపు.. మరొకటి స్టాక్ మార్కెట్ జోరు. ఈ రెండు ప్రధాన కారణాలు కూడా బంగారంపై మోజును కాస్తంత తగ్గేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.