ఒక్క స్నేహితుడూ లేడు...ఎండమావిగా బండబారి !
మానవ జీవిత వికాసంలో అడుగడుగునా స్నేహానికి ఎంతో విలువ ఉంది. మనిషిని సంఘ జీవి అంటారు. తోడు మనసుకు ఎంతో అవసరం. దానిని తీర్చేవాడు ఒక్క స్నేహితుడు మాత్రమే.
By: Satya P | 8 July 2026 8:10 AM ISTమానవ జీవిత వికాసంలో అడుగడుగునా స్నేహానికి ఎంతో విలువ ఉంది. మనిషిని సంఘ జీవి అంటారు. తోడు మనసుకు ఎంతో అవసరం. దానిని తీర్చేవాడు ఒక్క స్నేహితుడు మాత్రమే. తమ దగ్గర వారితో ఆఖరుకు రక్త సంబంధీకులతో సైతం చెప్పుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకోవడం జరుగుతుంది. ఒక్క స్నేహితుడు ఉంటే చాలు వేయి కష్టాలు సులువుగా దాటవేయవచ్చు అన్నది పెద్దలు చెప్పే మాట. పురాణాలలో చూస్తే ధుర్యధనుడు కర్ణుడు మధ్య ఉన్నది అవ్యాజమైన మిత్రుత్వం. హితుడా అంటూ సుయోధనుడు కర్ణుడికి తన జీవితంలో ఇచ్చిన ప్రాధాన్యం, దానికి తగినట్లుగానే కర్ణుడు దోస్త్ కోసం ఎంతకైనా చేసేందుకు వెనకాడని తత్వం యుగాలు దాటినా అందరికీ స్పూర్తిగా ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడు కుచేలుడి మధ్య పేద గొప్ప అంతరాలను దాటిన స్నేహం కూడా అద్భుతం అనిపిస్తుంది.
గతమంతా బంధమే :
మన పూర్వీకులు నిన్నా మొన్నటి తరాలు అందరికీ గంపెడు మంది స్నేహితులు ఉండేవారు. టీవీలు లేని రోజులలో బ్లాక్ అండ్ వైట్ డేస్ లో స్నేహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు, గంటలు రోజులు కూడా క్షణాలుగా మార్చేసుకున్న మిత్ర బంధాలు ఎన్నో వెనక్కి వెళ్తే గొప్పగా కనిపిస్తాయి. గత రెండు దశాబ్దాల నుంచి చూస్తే స్నేహితుడు పాత్ర ప్రతీ వారి జీవితంలో తగ్గిపోతూ వస్తోంది. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక అన్నీ తానే అయి ఫ్రెండ్ ని దూరం చేసిన వర్తమానం అందరికీ కళ్ళ ముందు కనిపిస్తోంది.
స్నేహానికే కరువు :
మారుతున్న ప్రపంచంలో అన్నింటికీ కరవు వచ్చి పడింది అని తెలుసు. కానీ ఇపుడు స్నేహితులకు కూడా కరవు వచ్చేసింది అన్నది వింటే కనుక ఆశ్చర్యంతో పాటు భయం వేస్తుంది. మనిషి భావోద్వేగాలను బంధాలను దాటి ఎక్కడికి పోతున్నాడు అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇదే నిజం కనిపిస్తోంది. స్నేహితులు అన్నది ఎవరికీ దక్కని చిక్కని వైనం కూడా మన ఎదుటే ఉంది. ఒక్క మంచి స్నేహితుడిని సంపాదించుకో చాలు జీవితం ధన్యం అన్న పెద్దల మాటలు కూడా నిశ్శబ్దంలో కలసి పోతున్న వేళ స్నేహితుడిని సైతం స్మార్ట్ ఫోన్ అవతలకు వెళ్ళగొట్టేసింది.
అసలు ఉన్నారా నేస్తాలు :
ఇక స్నేహితుల గురించి ఇటీవల కాలంలో వచ్చిన గణాంకాలు నివేదికలు చూస్తే షాకింగ్ గా ఉంటోంది. 1960 దశకంలో చూస్తే ఒక వ్యక్తికి సగటున వంద మంది వరకు సన్నిహిత స్నేహితులు ఉండేవారని నివేదికలు చెబుతున్నాయి. అదే 1990ల నాటికి వచ్చేసరికి ఆ సంఖ్య సగానికి సగం యాభైకి పడిపోయింది. 2020 కి వచ్చేసరికి అది కాస్తా ఏకంగా పదికి చేరింది. ఈ ఆరేళ్ళ కాలంలో కరోనా వంటి పెను విపత్తులు తరువాత మనిషి మరింత ఒంటరి అయి సామాజిక దూరం పాటిస్తూ పోతున్న సందర్భంలో ఒక్క స్నేహితుడు అయినా లేని వాతావరణం కనిపిస్తోంది అని అంటున్నారు.
మనసు విప్పుదామంటే :
ఈ రోజున మనసు విప్పుదామని ఎవరూ అనుకోవడం లేదు, ఒకవేళ అలా అనుకున్నా తోడుగా నీడగా నిలిచే స్నేహితుడు కనిపించడం లేదు. ఇటీఎవల జరిగిన ఒక సర్వే చూస్తే కనుక్ నిజమైన స్నేహితుడు ఒక్కరు కూడా లేరని తేలింది. ఆ సర్వే ప్రకారం భారత్ లాంటి ఎంతో సెంటిమెంట్ ఉన్న దేశంలో కూడా పన్నెండు శాతం మందికి చెప్పుకోదగ్గ స్నేహితుడు ఒక్కడంటే ఒక్కడూ లేడన్న కఠినమైన నిజం వెల్లడైంది.
ఆనాటి ఆ రోజులు :
గతంలో అయితే ఫ్రెండ్స్ తో గంటల సేపు గడిపిన వారమని పెద్దలు చెబుతున్నారు. కానీ ఇపుడు ఉన్న తరానికి స్మార్ట్ ఫోన్లు ఫ్రెండ్స్ గా మారిపోయాయి. వాటి తోనే పూర్తి కాలం గడుపుతున్నారు. అయితే మంచి స్నేహితులు ఉంటే మనిషి మానసిక ఆరోగ్యం ఎంతగానో బాగుంటుంది, ఒక ధీమా జీవితానికి జీవిత బీమా కూడా వస్తాయని మానసిక నిపుణులు అంటున్నారు. ఒంటరిగా జీవించడం అంటే రోజుకు ఇరవై సిగరెట్లు తాగినంత ప్రమాదకరమని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అధిక మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటివి ఒంటరి వాళ్ళను చుట్టుముడతాయి.
హృదయానికి నేస్తం :
స్నేహితుడు ఉంటే గుండె ఆరోగ్యానికి కూడా భరోసా అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంచి ఫ్రెండ్స్ తో కాలం గడిపే వారిలో బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. అలాగే స్నేహితుల తోడుంటే జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం వారితో కలిసి వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం, పాటలు పాడడం, సానుకూలమైన పోటీ తత్వం పెరగడం కలసి కొత్త పనులు మొదలుపెట్టడం వంటివి ఎన్నో చేయవచ్చు. అంతే కాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అని అంటున్నారు. అందువల్ల స్మార్ట్ ఫోన్లకు కాదు స్నేహితులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ తరాన్ని పెద్ద తరం కోరుతోంది. అలాగే వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు.
