అమ్మేలే కాదు.. నాన్నల్లోనూ అలాంటి ‘కెమిస్ట్రీ’
అమ్మతనం గురించి అందరూ చెప్పేవారే. అదే.. నాన్నతనం అంటే.. అదేంటని? అడిగేస్తారు.
By: Tupaki Desk | 4 May 2026 10:11 AM ISTఅమ్మతనం గురించి అందరూ చెప్పేవారే. అదే.. నాన్నతనం అంటే.. అదేంటని? అడిగేస్తారు. ప్రెగ్నెంట్ అయిన మహిళల్లో ఎలాంటి మార్పులు వస్తాయో.. తండ్రి కాబోతున్నానన్న ఆనందం పురుషుడిలోనూ బోలెడన్ని మార్పులు తీసుకొస్తాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. తాజా పరిశోధనల్లో కొత్తగా కనుగొన్నారంతే. పురుషుల్లో నాన్నతనం ఎప్పుడు ఎలా వస్తుంది? దానికి హార్మోన్లు ఎంతటి కీలక భూమిక పోషిస్తాయన్న విషయాన్ని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
భార్య ప్రెగ్నెంట్ అయ్యిందన్న వెంటనే తండ్రిలో మార్పు ఇట్టే వచ్చేస్తుంది. అప్పటివరకు ఉన్న అలవాట్లను మార్చేయటమే కాదు మగాడ్ని మరింత బాధ్యతాయుతంగా మార్చేస్తుంది. దంపతుల మధ్య ఉన్న మనస్పర్థల్ని సైతం తగ్గించేస్తుంది. ఇదంతా ఉత్తినే జరిగిపోదు. తండ్రి కాబోతున్న వేళ.. మగాళ్ల మెదళ్లలో చాలానే మార్పులు జరుగుతాయన్న విషయాన్ని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో వారికి తెలీకుండానే భార్య పట్ల.. రాబోయే బిడ్డ విషయంలో మరింత బాధ్యతాయుతమైన మానసిక స్థితికి చేరుకుంటున్నట్లుగా గుర్తించారు.
మనిషి మెదడులో తల్లిదండ్రులుగా వ్యవహరించే తీరుకు ఆలోపేరంటల్ సబ్ స్ట్రేట్ గా వ్యవహరిస్తారు. బిడ్డ పుట్టబోతున్న కబురు విన్నంతనే ఇది యాక్టివేట్ అవుతుంది. అమ్మ కాబోతున్న విషయం తెలిసినంతనే అమ్మాయిలో మార్పులు వచ్చినట్లే.. తండ్రి కాబోతున్నాననే భావన పురుషులను మార్చేస్తుంది. బిడ్డ సంరక్షణలో ఎక్కువగా పాలు పంచుకోవాలన్న భావన ఎంత ఎక్కువ ఉంటే.. ఆ మార్పు అంత ఎక్కువ అవుతుంది. దీనికి టెస్టోస్టిరాన్.. వాసోప్రిన్ లాంటి హార్మోన్లలో మార్పులు కూడా కారణం. ఈ కారణంగానే పురుషుల్లో అప్పటివరకు ఉండే దూకుడు స్వభావం తగ్గి.. ప్రశాంత చిత్తం పెరుగుతుంది.
పిల్లల్లేని పురుషఉల కంటే తండ్రులవుతున్న వారిలో టెస్టోస్టిరాన్ తక్కువగా ఉంటుందన్న విషయాన్ని యూఎస్ కు చెందిన నోట్రదామ్ వర్సిటీ అధ్యయనం గుర్తించగా.. ఈ కారణంగానే బిడ్డ పుట్టినంతనే ఆ శిశువుతో ఎక్కువగా మమేకం అవుతారన్న విషయాన్ని వెల్లడించింది. ఈ సమయంలో వారిలో ఆక్సోటోసిన్ స్థాయి విపరీతంగా పెరిగి.. తల్లి.. బిడ్డలపై మమకారం.. వారితో రిలేషన్ మరింత బలపడుతుంది. పలు అధ్యయనాల్లో తేలిందేమంటే.. ఆర్నెల్ల నుంచి రెండేళ్లలోపు వయసు ఉన్న పిల్లల తండ్రుల్లో ఆక్సిటోసిన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డను అప్యాయంగా చూసుకునే.. చేతుల్లోకి తీసుకునే సమయంలో ఆ తండ్రుల్లో ప్రేమ హర్మోన్ వెల్లువలా ఉత్పత్తి అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పిల్లలతో ఎక్కువగా ఆడిపాడి.. వారితో మమేకం అయ్యే తండ్రుల్లో ఆక్సిటోసిన్ గణనీయంగా ఉంటుందని తేలింది. బాలింత తల్లుల్లోని చనుబాల ఉత్పత్తికి ప్రోలాక్టిన్ అనే రసాయనం కారణం. ఆసక్తి కలిగించే అంశం ఏమంటే తండ్రులు అయ్యే వేళలో.. తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూసే పురుషుల్లో ఆ హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. డాడ్ బ్రెయిన్ అనే పుస్తక రచయిత టీం తొలిసారి తండ్రులు అవుతున్న మగాళ్ల మెదళ్లను స్కాన్ చేసి పరిశీలించినప్పుడు.. వారి మెదళ్లలో నాడీ సంబంధిత మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. కొత్త అనుభవాలకు సర్దుబాటు జరుగుతున్న వైనాన్ని గుర్తించారు. అందుకే అమ్మతనం మాత్రమే కాదు నాన్నతనం కూడా ఉంది బాస్.
