ఒడిశాలోని ఈ ఛాయ్ వాలా గురించి తెలుసుకోవాల్సిందే
ఇంతకూ ఈ తాతయ్య ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ఇంత వయసులో ఎలాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు?
By: Garuda Media | 12 April 2026 1:00 PM ISTవయసు ఒక నెంబరు మాత్రమే అని కొందరు చెబుతుంటారు.అలాంటి మాటలేమీ చెప్పకుండా.. తాను నమ్మిన విలువలను పాటిస్తూ.. బతికేసే ఒక సామాన్యుడి గురించి తెలుసుకోవాల్సిందే. మీద పడిన వయసు గురించి ఆలోచించకుండా.. తాను చేయాల్సిన పనుల మీదనే ఫోకస్ పెట్టే ఈ పెద్దాయన ఈ తరానికి మాత్రమే కాదు ఏ తరానికైనా కూడా స్ఫూర్తివంతంగా కనిపిస్తారు. ముప్ఫై ఏళ్లకే అపసోపాలు పడుతూ.. నాలుగు కి.మీ. నడవాల్సి వస్తే.. నరకంగా ఫీల్ అయ్యే నేటి తరానికి భిన్నంగా సెంచరీ దాటేసి.. ప్రస్తుతం 106 ఏళ్ల వయసులోనూ వ్యాపారం చేస్తున్న ఈ పెద్దాయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఇంతకూ ఈ తాతయ్య ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ఇంత వయసులో ఎలాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు? ఆయన దినచర్య ఎలా ఉంటుంది? ఆయన వ్యవహారశైలి ఏంటి? లాంటి ఎన్నో సందేహాలు మనసును ఆక్రమించేస్తాయి. అన్నింటికి సమాధానాలు చెప్పేస్తాం. ఈ 106 ఏళ్ల పెద్ద మనిషి.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని గడకణ ప్రాంతానికి చెందిన వారు. ఆయన పేరు.. లబణి బెహెరా. వయసు 106 ఏళ్లు మాత్రమే.
గడిచిన నలభై ఏళ్లుగా టీ దుకాణాన్ని నడుపుతున్నారు. ఇంత పెద్ద వయసులోనూ ఆయన ఎవరి మీదా ఆధారపడకపోవటం ఆయనకు మాత్రమే సాధ్యమేమో. తెల్లవారుజామున నాలుగు గంటల వేళకే ఛాయ్ ను సిద్ధం చేస్తారు. అలా మొదలయ్యే ఆయన దినచర్య రాత్రి వరకు నాన్ స్టాప్ గా సాగుతూనే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన 300 లీటర్ల పాలతో చేసిన ఛాయ్ ను అమ్ముతుంటారు.
ఆయన ఛాయ్ కోసం.. ఆయన జీవితం గురించి తెలుసుకోవటం కోసం పలువురు ఆయన వద్దకు వస్తుంటారు. ఆయన జీవన ప్రయాణం గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటారు.ఆయన అనుభవాల గురించి ఆసక్తిని వ్యక్తం చేస్తుంటారు. వారు అడిగే ప్రశ్నలకు ఆయన ఒపిగ్గా సమాధానాలు ఇస్తుంటారు. కష్టపడి సంపాదించి జీవించాలనే విధానం ఆయన సొంతం. ఇది మాటల్లోనే కాదు చేతల్లోనూ ఆయన చూపిస్తుంటారు.
పెద్ద వయస్కుడు కావటంతో ఆయనకు ప్రభుత్వం పింఛన్ ఇచ్చేందుకు అధికారులు ముందుకు రాగా.. ఆయన మాత్రం అందుకు నో చెప్పేశారు. తన జీవిత అవసరాలకు అవసరమైన మొత్తాన్ని తానే సంపాదించుకుంటానని.. ప్రభుత్వ ఇచ్చే పింఛన్ తనకు వద్దని స్పష్టం చేశారు. మారుతున్న జీవనశైలితో తరచూ ఏదో ఒక అనారోగ్యానికి గురయ్యే ఇప్పటివారికి భిన్నంగా ఆయన.. ఎంతో హుషారుగా.. ఆరోగ్యంగా ఉండటం చూస్తే.. వావ్ అనుకోకుండా ఉండలేం.
