Begin typing your search above and press return to search.

ముస్లింలను హిందూ మత ట్రస్టులలో అనుమతిస్తారా....సుప్రీం సూటి ప్రశ్న!

దేశ అత్యున్నత న్యాయ స్థానం కేంద్రం తీసుకుని వచ్చిన వక్ఫ్ చట్టం మీద వచ్చిన పిటిషన్లను గురువారం కూడా విచారించింది.

By:  Tupaki Desk   |   17 April 2025 4:55 PM IST
ముస్లింలను హిందూ మత ట్రస్టులలో అనుమతిస్తారా....సుప్రీం సూటి ప్రశ్న!
X

దేశ అత్యున్నత న్యాయ స్థానం కేంద్రం తీసుకుని వచ్చిన వక్ఫ్ చట్టం మీద వచ్చిన పిటిషన్లను గురువారం కూడా విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు కేంద్రం వక్ఫ్ చట్టం మీద తన అభిప్రాయాన్ని వారం రోజులలోగా చెప్పాలని ఆదేశించింది.

ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయవద్దని సూచించింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల మీద కేంద్రం వారంలోగా అఫిడవిట్ ని దాఖలు చేయాలని ఆదేశించింది.

అప్పటిదాక వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి మార్పులు చేయవద్దని, అలాగే వఫ్క్ వక్ఫ్ బై యూజర్ అస్తులను డీ నోటిఫై చేయవద్దు అని కూడా కోరింది. ఇదిలా ఉంటే నిన్న బుధవారం వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలు అయిన 72 పిటిషన్ల మీద సుప్రీం కోర్టు విచారణను చేపట్టింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాధన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుని విచారించింది. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలను ఈ కేసు విషయంలో ధర్మానసనం చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఎలా భాగం కల్పిస్తారని ప్రశ్నించింది. అంతే కాదు ఇప్పుడు ముస్లింలను హిందూ మత ట్రస్టులలో భాగం కావడానికి అనుమతిస్తారా అని కేంద్రాన్ని సూటిగానే ప్రశ్నించింది.

మతపరమైన దాతృత్వ వినియోగం ఆధారంగా వచ్చిన ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించే పద్ధతి గురించి కూడా విచారణ జరిగింది. కేంద్రం అలాంటి వక్ఫ్‌లను ఎలా గుర్తిస్తుందని ప్రశ్నించింది. వారి వద్ద ఏ పత్రాలు ఉంటాయని కూడా సందేహం వ్యక్తం చేసింది. చివరికి ఇది ఏదో రద్దుకు దారితీస్తుందని పేర్కొంది.

వక్ఫ్ సృష్టించడానికి వ్యక్తుల అర్హతను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండాలా అని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ సవరించిన వక్ఫ్ చట్టం ద్వారా వేరే విధంగా పెత్తనం చేయాలని కోరుకోవడం లేదని అన్నారు.

దీన్ మీద స్పందించిన ధర్మాసనం ఇక నుండి ముస్లింలను హిందూ ఎండోమెంట్ బోర్డులలో భాగం కావడానికి అనుమతిస్తున్నట్లు మీరు చెబుతున్నారా అని ప్రశ్నించింది. అలా అయితే దానిని బహిరంగంగా చెప్పండి అని కూడా స్పష్టం చేసింది.శతాబ్దం క్రితం వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను ఏకపక్షంగా తిరిగి వర్గీకరించలేమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇక పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముస్లింలు మాత్రమే వక్ఫ్‌ను సృష్టించడానికి అనుమతించే నిబంధన రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఒకరు ముస్లింనా కాదా అని ప్రభుత్వం ఎలా నిర్ణయించగలదు అని ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తున్న వారు మాత్రమే వక్ఫ్‌ను సృష్టించగలరని ప్రభుత్వం ఎలా చెప్పగలదని ఆయన లీగల్ పాయింట్ ని లేవనెత్తారు.

సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ, ఈ చట్టం దేశవ్యాప్తంగా అనేక చిక్కులను కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. వినియోగదారుడి ద్వారా వక్ఫ్ అనేది చాలా కాలంగా కొనసాగుతున్న ఇస్లామిక్ ఆచారమని దానిని కొట్టివేయలేమని సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మది అన్నారు.

ఇదిలా ఉంటే వక్ఫ్ సవరణ చట్టం, 2025 ను ఇటీవలనే పార్లమెంట్ ఉభయ సభలలో వేడి చర్చల మధ్య ఆమోదించారు. తర్వాత ఏప్రిల్ 5న రాష్ట్రపతి ఆమోదం పొందింది. రాజ్యసభలో, 128 మంది సభ్యులు బిల్లుకు మద్దతు ఇవ్వగా, 95 మంది దీనిని వ్యతిరేకించారు. లోక్‌సభలో, బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు మరియు వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ఈ వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ మొత్తం 72 పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు చేయబడ్డాయి.

ఈ కేసుని గురువారం కూడా విచారించిన సుప్రీంకోర్టు కేంద్రం నుంచి అఫిడవిట్ కోరుకుంటూ వచ్చే వారానికి విచారణను వాయిదా వేసింది. దాంతో వక్ఫ్ సవరణ చట్టాన్ని చేసిన కేంద్రం ఈ విషయంలో ఎలా సమర్ధించుకుంటుందో అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది.