హైదరాబాద్ మెట్రో పనులకు బ్రేక్.. హైకోర్టు సంచలన ఆర్డర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండో దశ మెట్రో పనులకు హైకోర్టు బ్రేకులు వేసింది.
By: Tupaki Desk | 13 Jun 2025 10:18 AM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండో దశ మెట్రో పనులకు హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ పనులను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ హయాం లో మెట్రో పనులు ముందుకు సాగాయి. దీంతో మెట్రో పనులను బీఆర్ ఎస్ నాయకులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తాము రెండో దశ పనులను చేపట్టి వడివడిగా పూర్తి చేసి.. తమ ఖాతాలోనూ ఈ పనులను వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఈ క్రమంలోనే రెండో దశ మెట్రో పనులను సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ క్రమంలో చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురాణి హవేలి, దారుల్‌షిఫా మసీద్, మొగల్పూరా టూంబ్ సమీపంలో పనులు చేపట్టేందుకు డీపీఆర్ రెడీ చేసుకున్నారు. నేడో రేపో ఈ పనులు ప్రారంభం అవుతాయని సర్కారు కూడా వెల్లడించింది. అయితే.. చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు భారత వారసత్వ సంపద జాబితాల్లో ఉన్నాయని.. పురావస్తు చట్టం ప్రకారం.. వీటికి సమీపంలోను.. వాటి వద్ద కూడా.. ఎలాంటి పనులు చేపట్టడానికి వీల్లేదని పేర్కొంటూ.. యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
దీనిని విచారించిన హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి పనులు చేపట్టరాదని పేర్కొంటూ.. స్టే విధించింది. భారత వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని.. అలాంటి ప్రభుత్వమే.. ఇలా చేయడం ఏంటని ప్రశ్నించింది. వాటి సమీపంలో ఎలాంటి పనులు చేసేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకల ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఎంతో కీలక ప్రాజెక్టు: సర్కారు
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు ఎంతో కీలకమని.. లక్షలాది మంది ప్రజలపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. వారసత్వ సంపదకు ఎలాంటి భంగం కలిగించబో మని కూడా పేర్కొంది. అయినా.. హైకోర్టు ససేమిరా అంది. దీంతో సర్కారు మరిన్ని వివరాలు అందించేందుకు.. బలమైన వాదనలు వినిపించేందుకు.. తమకు మూడు వారాల సమయం ఇవ్వాలనికోరింది. దీనికి హైకోర్టు అంగీకరించింది.
