'పెళ్లి హామీ తప్పడం'పై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి, తప్పడం మోసం కావచ్చేమో గానీ.. నేరంగా భావించే మోసం కాదు అని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
By: Tupaki Desk | 30 Jun 2025 12:00 AM ISTపెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి, తప్పడం మోసం కావచ్చేమో గానీ.. నేరంగా భావించే మోసం కాదు అని తెలంగాణ హైకోర్టు తెలిపింది. పెళ్లి హామీ నెరవేర్చకపోవడమనేది మోసం ఆరోపణల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు నోచుకోదని పేర్కొంది. అంటే.. ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటాను అని మాట ఇచ్చి, ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే.. అలాంటి వ్యక్తిపై చట్టపరంగా ఎలాంటి చర్యలూ ఉండవు!
అయితే... పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేటప్పుడే.. మోసం చేయాలనే ఉద్దేశం ఉంది అని తేలితే.. మాత్రం అది కచ్చితంగా నేరమే అవుతుంది. కరకల్ల పద్మినీరెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో 2019లో తనపై నమోదు చేసిన క్రిమినల్ చర్యలను సవాల్ చేస్తూ.. హైదరాబాద్ కర్మన్ ఘాట్ కు చెందిన రాజాపురం జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఈ పిటిషన్ ను జస్టిస్ ఎన్.తుకారాంజీ విచారణ జరిపారు. ఈ క్రమంలో... జీవన్ రెడ్డి 2016లో తన తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తనకు మాట ఇచ్చారని పద్మినిరెడ్డి కోర్టుకు తెలిపారు. కానీ.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన పెళ్ళి చేసుకోలేదని అన్నారు. దీంతో... జీవన్ రెడ్డి తనను మోసం చేశారని పద్మిని తెలిపారు.
దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు జీవన్ రెడ్డిపై నేరపూరిత కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కోర్టు విచారణ పరిధిలో ఉంది. అలా అక్కడ విచారణ కొనసాగుతున్న సమయంలో, కేసును రద్దు చెయ్యాలని కోరుతూ.. జీవన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న తర్వాత, కోర్టు.. మరింత విచారణ కోసం వాయిదా వేసింది.
ఈ సందర్భంగా స్పందించిన కోర్టు... పెళ్లి హామీ నెరవేర్చకపోవడమనేది మోసం ఆరోపణల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు నోచుకోదని.. నిజాయతీ లేని ప్రలోభం ఉంటే తప్ప, వివాహ హామీని ఉల్లంఘించినందుకు నిందితుడిపై మోసం కేసును కొనసాగించలేమని స్పష్టం చేసింది.
