Begin typing your search above and press return to search.

ఉచిత హామీలపై పిల్... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

అవును... రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది

By:  Tupaki Desk   |   21 March 2024 5:38 AM GMT
ఉచిత హామీలపై పిల్... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
X

ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలన్నీ ఉచిత పథకాలపైనే ప్రధానంగా దృష్టిపెడతాయనే విమర్శ భారతదేశ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఇలాంటి పథకాలకు ఆదరణ కూడా ఉంటుందనే కామెంట్లూ వినిపిస్తుంటాయి. అయితే ఇది ఆ పూటకు గడవడానికి మాత్రమే ఉపయోగపడే విధానమని.. భవిష్యత్తు అవసరాలను, దేశాభివృద్ధినీ దృష్టిలో పెట్టుకునే తీసుకునే నిర్ణయం కాదని పలువురు అభిప్రాయపడుతుంటారు.

పైగా కొన్ని అసంబద్ధ ఉచిత పథకాలు పౌరుడిని బద్దకస్తుడిని చేయడమే కాకుండా... వారిలో పోరాట పఠిమను, కష్టపడే తత్వాన్ని నశింపచేస్తున్నాయని కూడా పలువురు అభిప్రాయపడుతుంటారు. రాజకీయ పార్టీలు కూడా... అధికారంలో ఉన్న వారు నాలుగు ఉచితాలిస్తే... ప్రతిపక్షంలో ఉన్నవారు మరో అడుగు ముందుకు వేసి ఆ నాలుగుని డబుల్ చేస్తామని చెబుతుంటారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై సుప్రీంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

అవును... రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీంతో ఈ పిల్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... ఈ పిటిషన్ పై తాము మాట్లాడుకున్నామని, ఇది చాలా ముఖ్యమైనదని, దీన్ని జాబితాలో ప్రస్థావిస్తామని బుధవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

ఏప్రిల్ 19నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పిల్ ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిల్ లో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ కీలక విషయాలను ప్రస్థావించారు. ఇందులో భాగంగా... రాజకీయ లబ్ధి కోసం ప్రకటించే ఉచిత హామీలపై నిధేధం విధించాలని కోరారు. ఇవి రాజ్యాంగ విరుద్ధమని, వీటిని నిరోధించేందుకు చర్యలు తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.

ఇదే క్రమంలో ఈ అసంబద్ధ ఉచిత హామీలు ప్రజాస్వామ్య మనుగడకు, రాజ్యాంగ స్పూర్తికీ విఘాతమని ఆయన తెలిపారు. పైగా... ప్రభుత్వ ఖజానాలోంచి ఓటరుకు డబ్బు ఇవ్వడం కూడా లంచం కిందకే వస్తుందని.. ఇది పూర్తిగా అనైతికమని.. ప్రజాస్వామ్య విలువలను రక్షించాలంటే ఇలాంటివాటికి అడ్డుకట్ట వేయాల్సిందే అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో... లోక్ సభ ఎన్నికల ముందే ఈ పిల్ పై విచారణ జరిపించాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించడంతో ఏమి జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.