Begin typing your search above and press return to search.

అదానీ›– హిడెన్‌ బర్గ్‌ కేసులో 'సుప్రీం' సంచలన తీర్పు

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ – హిడెన్‌ బర్గ్‌ వివాదంలో దేశ అత్యున్నత స్థానంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 7:26 AM GMT
అదానీ›– హిడెన్‌ బర్గ్‌ కేసులో సుప్రీం సంచలన తీర్పు
X

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ – హిడెన్‌ బర్గ్‌ వివాదంలో దేశ అత్యున్నత స్థానంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ విషయంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. సెబీ చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్‌ కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని తెలిపింది. అలాగే మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

అదానీ గ్రూప్‌ కంపెనీ తన విలువను కృత్రిమంగా పెంచుకోవడానికి తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ గతేడాది హిడెన్‌ బర్గ్‌ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి లేపిన విషయం తెలిసిందే. స్టాక్‌ మార్కెట్‌ లో షేర్‌ విలువ పెంచుకునేందుకు అదానీ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని 2023 జనవరిలో అమెరికాకు చెందిన హిడెన్‌ బర్గ్‌ సంస్థ నివేదిక వెలువరించింది. ఇది దేశవ్యాప్త సంచలనానికి కారణమైంది.

దీనిపై దర్యాప్తు కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని పలువురు ఆశ్రయించారు. దీనిపై సెబీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి గత సంవత్సరం నవంబర్‌ 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

తాజాగా నాలుగు పిటిషన్లలో తీర్పును వెలువరించింది. అదానీ కేసులో సిట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. సెబీ రెగ్యులేషన్స్‌ లో సవరణలు చేయాలని ఆదేశించడానికి, వాటిని నియంత్రించడానికి కానీ సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అదానీ కేసులో మొత్తం 24 ఆరోపణల్లో 22 ఆరోపణలపై ఇప్పటికే సెబీ విచారణ పూర్తి చేసిందని గుర్తు చేసింది.

హిడెన్‌ బర్గ్‌ .. అదానీ కంపెనీలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో షార్ట్‌ సెల్లింగ్‌ ఉల్లంఘనలను ప్రభుత్వం, సెబీ పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్టాలకు అనుగుణంగా సెబీ విచారణ పూర్తి చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సభ్యుల నిజాయితీపై లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. సెబీ దర్యాప్తును కూడా సమర్థించింది. ప్రభుత్వం, సెబీలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది.