Begin typing your search above and press return to search.

పెళ్లి చేసుకుందని జాబ్ నుంచి తీసేసిన ‘కేంద్రం’పై సుప్రీం ఫైన్

26 ఏళ్ల క్రితం ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు. ఎందుకో తెలుసా? పని సరిగా చేయలేదని కాదు. తప్పుడు పనులు చేసినందుకు కాదు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 4:50 AM GMT
పెళ్లి చేసుకుందని జాబ్ నుంచి తీసేసిన ‘కేంద్రం’పై సుప్రీం ఫైన్
X

26 ఏళ్ల క్రితం ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు. ఎందుకో తెలుసా? పని సరిగా చేయలేదని కాదు. తప్పుడు పనులు చేసినందుకు కాదు. పెళ్లి చేసుకుందన్న కారణంతో జాబ్ నుంచి తీసేశారు. అది కూడా ప్రైవేటు సంస్థలు కాదు.. నాటి కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు. విన్నంతనే విస్మయానికి గురయ్యే ఈ ఉదంతానికి సంబంధించి రెండున్నర దశాబ్దాల పోరు అనంతరం సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. వివాహాన్ని కారణంగా చూపుతూ మహిళల్ని ఉద్యోగం నుంచి తొలగించే ఏ చట్టాన్ని అయినా రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది దేశ అత్యుత్తమ న్యాయస్థానం.

షాకింగ్ గా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. సైన్యంలో నర్సుగా సేవలు అందించే సెలినా జాన్ పెళ్లి చేసుకున్నారన్న కారణంగా 1988లో కేంద్రం విధుల నుంచి తప్పించింది. దీనిపై ఆమె న్యాయపోరాటాన్ని షురూ చేశారు. ఈ కేసుపై ఆమె గడిచిన 26 ఏళ్లుగా పోరాడుతున్నారు. తాజాగా ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఆమె న్యాయపోరాటానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆమెకు రూ.60 లక్షల మొత్తాన్ని చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించారు.

విధుల నుంచి తొలగించే నాటికి ఆమె సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను జాబ్ నుంచి తీసేయటంపై ఆమె తొలుత అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రైబ్యునల్ తీర్పును ఇచ్చింది. ఈ ఆదేశాల్ని సవాలు చేస్తూ 2019లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. ట్రైబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని రెండు నెలల్లోఆమెకు చెల్లించాల్సిన రూ.60 లక్షల మొత్తాన్ని చెల్లించాలని తీర్పును ఇచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఏ మాటకుఆ మాటే చెప్పాలి. ఈ ఉదంతంలో బాధితురాలు సెలినాను అభినందించాల్సిందే. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి 26 ఏళ్లు నమ్మిన దాని కోసం ఇంతలా పోరాడటం గ్రేట్ అని చెప్పక తప్పదు.