Begin typing your search above and press return to search.

గవర్నర్ గిరీ చెల్లదు.. సుప్రీం సంచలన తీర్పు!

తమిళనాడు గవర్నర్ తీరును తప్పుపడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతించారు.

By:  Tupaki Desk   |   8 April 2025 2:41 PM IST
Supreme Court of India has ruled against Tamil Nadu Governor
X

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును తప్పుపడుతూ, ఆయన పెండింగులో పెట్టిన 10 బిల్లులను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతున్న గవర్నర్ రవికి సుప్రీం తీర్పుతో షాక్ ఇచ్చినట్లైంది. కేంద్ర ప్రభుత్వమే సుప్రీం అన్నట్లు డీఎంకే ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన గవర్నర్ రవిపై తమిళనాడులో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి పెద్ద ఊరట దక్కింది. దీంతో ఈ తీర్పు తమ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని సీఎం స్టాలిన్ స్పందించారు.

తమిళనాడు గవర్నర్ తీరును తప్పుపడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతించారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సమాఖ్య రాజకీయాల కోసం పోరాడుతున్న తమకు సుప్రీంకోర్టు అండగా నిలవడంపై సీఎం హర్షం ప్రకటించారు. సుప్రీం తీర్పును చారిత్రాత్మకంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి, అన్ని రాష్ట్రాలకు ఊరట దక్కిందన్నారు. అసెంబ్లీ ఆమోదించిన 10కి పైగా బిల్లులను గవర్నర్ రవి తన అధికారాలతో అడ్డుకోవడం సరికాదని సుప్రీం అభిప్రాయపడింది. గవర్నర్ చర్యలు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లలను సవరణ కోసం తిప్పి పంపే అధికారం గవర్నరుకు ఉంటుంది. అయితే బిల్లులను తొక్కిపెట్టే అధికారం మాత్రం గవర్నర్ లకు లేదు. తమిళనాడులోనే కాదు బీజేపీయేతర పార్టీలు పాలిత రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణ గవర్నరుగా తమిళసై సౌందర్ రాజన్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్పీం వెలువరించిన తీర్పు చర్చనీయాంశమవుతోంది.

గవర్నర్ రవి బిల్లును నిలిపివేసిన రోజు నుంచి ఆమోదిస్తున్నట్లు సుప్రీం తీర్పునివ్వడం సంచలనంగా మారింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ సంచలన తీర్పు నిచ్చింది. గవర్నర్ తీరు చట్టవిరుద్ధం, ఏకపక్షమంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంతో స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గవర్నర్ తీరును తప్పుపడుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీం స్పష్టం చేసింది. రాష్ట్ర విశ్వ విద్యాలయాల వైస్ ‌చాన్సలర్ల నియామకానికి సంబంధించిన బిల్లులను గవర్నర్ రవి ఆమోదించలేదు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు గవర్నర్ల అధికారాలపై స్పష్టత ఇచ్చింది.