సుప్రీం తీర్పు.. టీవీ డిబేట్లకు ఊపిరి పోసినట్టేనా ..!
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఆదేశం ఏదైనా చాలా సున్నితమైనది.
By: Tupaki Desk | 15 Jun 2025 7:00 PM ISTసీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఆదేశం ఏదైనా చాలా సున్నితమైనది. చాలా ఆలోచనత్మకమైనటువంటి ఆదేశాలు గానే చెప్పాలి. ముఖ్యంగా విషయ ప్రాధాన్యం కన్నా భావ ప్రకటన స్వేచ్ఛకు పెద్ద పీట వేసింది. ప్రస్తుతం రాజకీయాలను, సమాజాన్ని కూడా శాసిస్తున్న టెలివిజన్ చానళ్ళ భవిష్యత్తును కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందనే భావన తాజా ఆదేశాలు ఇచ్చింది. వ్యాఖ్యలు చేసింది ఒకరు.. శిక్ష అనుభవించే పరిస్థితికి వచ్చింది ఒకరు.. అన్నట్టుగా చర్చకు వచ్చిన కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛకు పెద్దపీట వేసింది.
ముఖ్యంగా జర్నలిజం స్వేచ్ఛకు మరింత ఉన్నత స్థానాన్ని, ఉన్నత గౌరవాన్ని, ఉన్నత హక్కును కూడా కల్పించింది. ఇది కేవలం శ్రీనివాసరావు కోణంలో చూస్తే అది తక్కువ చేసినట్టే అవుతుంది. దీనిని చాలా విస్తృతమైనటువంటి కోణంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు జర్నలిజం స్వేచ్ఛకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత అర్థం మనకు కనిపిస్తుంది. నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన, లేకపోతే వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలపై నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అంటూ సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్న టెలివిజన్ రంగానికి కీలకం.
ఈరోజు అనేక చర్చలు టీవీలో జరుగుతూనే ఉన్నాయి. అనేక సందేహాలు, సమస్యలు, వివాదాలు, విమర్శలు వింటూనే ఉన్నాం . ఈ నేపథ్యంలో ఏ చర్చ ఎటు దారి మళ్లుతుందో? ఏ సమాజం ఏ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుందో అనే ఒక భయానకమైన పరిస్థితి నేడు టెలివిజన్ రంగానికి పెను శాపంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో జర్నలిజానికి, భావ ప్రకటన స్వేచ్ఛను ముడిపెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థీకృతంగా చూసినప్పుడు దీని విలువ, ప్రాధాన్యం మనకి స్పష్టంగా గోచరిస్తాయి. వ్యక్తిగా నేడు కొమ్మినేని కావచ్చు రేపు మరొకరు కావచ్చు.
కానీ వ్యవస్థీకృతంగా ఉన్నది, ప్రజలకు చేరువైంది టెలివిజన్ రంగం. ఈ టెలివిజన్లలో వచ్చే చర్చలు, వ్యక్తుల భావాలు వారు మాట్లాడే సంభాషణ వంటి విషయాలను పరిశీలించినప్పుడు సుప్రీంకోర్టు స్పష్టమైన స్వేచ్ఛను కల్పిస్తూ అదే సమయంలో బాధ్యతాయుతమైనటువంటి విధానాలను కూడా క్రోడీకరించటం నిజంగా టీవీ డిబేట్లకు సుప్రీంకోర్టు భారీ స్వేచ్ఛను, ఊరటను కల్పించిందని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు టీవీ చర్చలపై నమోదైన 32 కేసులను పరిశీలిస్తే తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు భిన్నమైనవి. భవిష్యత్తును నిర్దేశించేవి కూడా అవుతాయి అనడంలో సందేహం లేదు.
