సోషల్ మీడియా పై అభ్యంతరకర పోస్టులు.. సుప్రీం కోర్టు సీరియస్
ఈ వ్యాఖ్యలు ప్రముఖ కార్టూనిస్టు హేమంత్ మాలవీయ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేటప్పుడు వచ్చాయి.
By: Tupaki Desk | 15 July 2025 8:00 PM ISTసోషల్ మీడియా వేదికగా కొందరు యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, కళాకారులు ఏదిపడితే అది పోస్టు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుండటంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భావ ప్రకటనకు స్వేచ్ఛ ఉందనుకుని కొందరు ఆ హక్కును అడ్డదిడ్డంగా వాడుకుంటున్నారని మండిపడింది. అలాంటి అభ్యంతరకర పోస్టులకు నియంత్రణ అవసరమని, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలు ప్రముఖ కార్టూనిస్టు హేమంత్ మాలవీయ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేటప్పుడు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్‌పై కార్టూన్లు వేయడంతో తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మాలవీయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనపై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. మాలవీయ పోస్ట్‌లు హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త వినయ్ జోషి ఫిర్యాదు చేశారు.
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం.. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్‌లు ‘‘సోషల్ మీడియాలో ఏం చేసినా చెల్లిపోతుందన్న ధోరణి పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. అభ్యంతరకర విషయాల ప్రచారంపై చర్యలు తప్పవు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మానవ పరిమితులలో ఉండాలి’’ అని స్పష్టం చేశారు.
అయితే.. భావ ప్రకటనకు పరిమితులు ఉన్నప్పటికీ, స్వేచ్ఛను దుర్వినియోగం చేశారనే నేరారోపణ ఆధారాలు లేకపోవడంతో హేమంత్ మాలవీయకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణను సుప్రీం కోర్టు ఇచ్చింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పెరుగుతున్న వ్యాఖ్యలు, పోస్టులపై ఒక స్పష్టమైన దృష్టికోణం అవసరమని సూచించింది.
సామాజిక మాధ్యమాల వృద్ధి ద్వారా ప్రజల భావాలను గౌరవించడం, తమ హక్కులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం అవసరం. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే అది చట్టపరమైన పరిణామాలకు దారి తీస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించడంలో స్పష్టంగా కనిపిస్తుంది.
