Begin typing your search above and press return to search.

సారీ చెప్పేది ఇలానా? ఆ మంత్రి పై సుప్రీం సీరియస్

భారత ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కువ్వర్ విజయ్ షా తీరును తీవ్రంగా తప్పు పట్టింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం.

By:  Tupaki Desk   |   29 July 2025 10:47 AM IST
సారీ చెప్పేది ఇలానా? ఆ మంత్రి పై సుప్రీం సీరియస్
X

ఆపరేషన్ సిందూర్ వేళ.. భారత ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కువ్వర్ విజయ్ షా తీరును తీవ్రంగా తప్పు పట్టింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం. బహిరంగ క్షమాపణలు చెప్పకుండా తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ సీరియస్ అయిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మంత్రి ప్రవర్తన తీరుపై అనుమానాల్ని వ్యక్తం చేసింది.

మంత్రి ప్రవర్తన.. వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తాము అనుమానించాల్సి వస్తోందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్.. జస్టిస్ జోయ్ మల్య బాగ్చిల ద్విసభ్య ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఆపరేషన్ సిందూర్ వేళ.. కల్నల్ సోఫియా.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు మీడియాకు జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు వెల్లడించటం తెలిసిందే. వీరిపై మంత్రి కున్వర్ విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేయటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం.. సుప్రీంకోర్టు సైతం సారీ చెప్పాలని ఆదేశించింది.

ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానని ఆదేశించింది. మంత్రిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంత్రి తన క్షమాపణల్ని తూతూ మంత్రంగా చెప్పటాన్ని సుప్రీం తప్పు పట్టింది. క్షమాపణలు చెప్పినట్లుగా రికార్డు చేయాలని.. దాన్ని తాము చూడాలని అనుకుంటున్నట్లుగా ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు.. సిట్ ను ఆగస్టు 13 లోపు నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

మంత్రి చేసిన ప్రకటనతో పాటు ఇదే అంశంపై ఇతరులు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని కూడా రికార్డు చేయాలని చెప్పిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహించిన వేళ.. ఇప్పటికైనా మధ్యప్రదేశ్ మంత్రి తన తీరును మార్చుకుంటారా? అత్యుత్తమ న్యాయస్థానం చెప్పినట్లు క్షమాపణలు చెబుతారా? అన్నది ప్రశ్నగా మారింది.