తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సుప్రీం సపోర్టు.. ఇక తగ్గేదేలే అంటున్న వైసీపీ
15 నెలలుగా సొంత నియోజకవర్గం తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోతున్న పెద్దారెడ్డి ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
By: Tupaki Desk | 29 Aug 2025 7:12 PM ISTవైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. 15 నెలలుగా సొంత నియోజకవర్గం తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోతున్న పెద్దారెడ్డి ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రతల పేరుతో తనను తాడిపత్రిలో ఇంటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. దీనిపై తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, పోలీసు భద్రత మధ్య పెద్దారెడ్డిని తాడిపత్రిలో ఆయన ఇంటికి తీసుకువెళ్లాలని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచులో సవాల్ చేసింది. శాంతిభద్రతల సమస్యతో డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుపై పెద్దారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లగా సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అమలు చేయాలని తీర్పు వెలువరించింది.
సుప్రీం తీర్పుతో తాడిపత్రి రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇరువర్గాల వారు గతంలో అనేక సార్లు దాడులు, ప్రతిదాడులకు దిగడంతో తాడిపత్రి రక్తమోడింది. ఎన్నికల సమయంలో పరిస్థితి మరింత దిగజారడంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని, సిట్టింగ్ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తొలుత తాడిపత్రి నుంచి బహిష్కరించారు. ఎన్నికల అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిపై ఆంక్షలు తొలగించారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దారెడ్డిపైనా ప్రభుత్వం ఆంక్షలు తొలగించినా, ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టకుండా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయితే పోలీసులు మాత్రం అందుకు అంగీకరించలేదు. తాడిపత్రి ఊరు బయటే పెద్దారెడ్డిని ఆపేసి వెనక్కి పంపేవారు. ఈ పరిస్థితుల్లో పోలీసుల తీరును తప్పుపడుతూ పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా, పోలీసులు మళ్లీ అప్పీలు చేయడంతో పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోయారు.
ఈ విషయంపై పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూలంగా తీర్పురావడంతో తాడిపత్రికి వచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లు చెబుతున్నారు. పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్లకుండా ఎవరు ఆపుతున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో ఆయన భద్రతకు సంబంధించి అవసరమైన ఖర్చును భరిస్తామని పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఆయనకు భద్రత కల్పించాలని ఆదేశాలు విడుదల చేస్తూ విచారణను ముగించినట్లు ప్రకటించింది. దీంతో తాడిపత్రి పాలిటిక్స్ వేడెక్కే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
