Begin typing your search above and press return to search.

వడోదర ప్రమాదం కేసు: లా విద్యార్థికి బెయిల్ రద్దు చేయని సుప్రీంకోర్టు

గుజరాత్‌లోని వడోదరలో మత్తులో కారు నడిపి ఒకరి మృతికి.. పలువురి గాయాలకు కారణమైన లా విద్యార్థి రక్షిత్ చౌరాసియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

By:  A.N.Kumar   |   24 March 2026 5:00 AM IST
వడోదర ప్రమాదం కేసు: లా విద్యార్థికి బెయిల్ రద్దు చేయని సుప్రీంకోర్టు
X

గుజరాత్‌లోని వడోదరలో మత్తులో కారు నడిపి ఒకరి మృతికి.. పలువురి గాయాలకు కారణమైన లా విద్యార్థి రక్షిత్ చౌరాసియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గుజరాత్ హైకోర్టు అతనికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో చౌరాసియాకు లభించిన బెయిల్ యథాతథంగా కొనసాగనుంది.

న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు ఇప్పటికే సుమారు తొమ్మిది నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?

గత ఏడాది మార్చి 13న వడోదరలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల లా విద్యార్థి రక్షిత్ చౌరాసియా, తన కారును అతివేగంగా అదుపులేకుండా నడిపాడు. మత్తులో ఉన్న అతను రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడమే కాకుండా పాదచారులపైకి కారును పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో హేమలిబెన్ పటేల్ అనే మహిళ ఘటనా స్థలంలోనే మరణించగా 12 ఏళ్ల జైని, 35 ఏళ్ల నిషాబెన్ సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రభుత్వ వాదనలు.. నిందితుడి తీరు

నిందితుడు ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి పశ్చాత్తాపం చూపాల్సింది పోయి “అనదర్ రౌండ్, అనదర్ రౌండ్” అంటూ అరిచాడని ఇది అతని మొండితనాన్ని బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వాదించింది. అతను మత్తు పదార్థాలకు బానిస అయ్యాడని ఇటువంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే రాష్ డ్రైవింగ్ కేసులో బెయిల్ అంశాన్ని మాత్రమే తాము పరిగణిస్తున్నామని, మత్తు పదార్థాల సేవనంపై విడిగా విచారణ జరుగుతుందని కోర్టు పేర్కొంది. తొలుత తాను ఏమీ తీసుకోలేదని బుకాయించిన చౌరాసియా ఆ తర్వాత భాంగ్ (కేనాబిస్) సేవించినట్లు అంగీకరించాడు. బాధితుల కుటుంబాలను కలిసి క్షమాపణ కోరతానని కూడా వెల్లడించాడు.

చట్టపరమైన చర్యలు

పోలీసులు చౌరాసియాపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు నెల రోజుల ముందే చౌరాసియా ఒక వివాదంలో చిక్కుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో కేవలం క్షమాపణ లేఖతో బయటపడిన అతను మళ్ళీ ఇంతటి ఘోరానికి ఒడిగట్టడం గమనార్హం.సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రాబోయే రోజుల్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కేసుల్లో బెయిల్ మంజూరు.. రద్దుకు సంబంధించి ఒక కీలక మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.