Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిలు కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్పుపడుతూ పిటిషన్ ను తిరస్కరించింది.

By:  Tupaki Desk   |   7 Oct 2026 2:19 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
X

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిలు కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్పుపడుతూ పిటిషన్ ను తిరస్కరించింది. హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిలు రద్దు కావడంతో ఈ ఏడాది మే 13న ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి ఆయన బెయిలు కోసం విస్తృతంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముందుగా రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసులు అనంతబాబు బెయిలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో అక్కడ చుక్క ఎదురైందని చెబుతున్నారు. గత వారం అనంతబాబుకు బెయిలు ఇవ్వలేమని రాజమహేంద్రవరం కోర్టు తీర్పు ఇవ్వగా, అనంతబాబు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారని అంటున్నారు.

జిల్లా కోర్టు బెయిలు పిటిషన్ తిరస్కరించడంతో నేరుగా సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితుడు ముందుగా జిల్లా కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాల్సివుందని వ్యాఖ్యానించిందని చెబుతున్నారు. కేసు విచారణ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ఈ సమయంలో తాము బెయిలు ఇవ్వలేమని ధర్మాసనం వ్యాఖ్యానించిందని అంటున్నారు. కేు మెరిట్స్ ఆధారంగా రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ కింద బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసిందని చెబుతున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నందున తదుపరి న్యాయపరమైన చర్యలను హైకోర్టు పరిధిలోనే చేపట్టాల్సివుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

కాగా, ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూద్రా వాదించారు. మొత్తం87 మంది సాక్షుల్లో చాలా మంది విచారణ ఇప్పటికే పూర్తయిందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో బెయిలు మంజూరు చేయడం సముచితం కాదన్న ప్రభుత్వ వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని, నిందితుడు అనంతబాబుకు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పిందని అంటున్నారు. 2022 మే 19న అనంతబాబు వద్ద డ్రైవరుగా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని నిందితుడు ప్లాన్ చేశాడని అభియోగాలు నమోదు చేశారు. అప్పట్లోనే ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయగా, 90 రోజుల పాటు చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది.

ఇక 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎమ్మెల్సీ అనంతబాబు స్వేచ్ఛగా తిరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును పునర్విచారణకు ఆదేశించడంతో ఎమ్మెల్సీకి కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీతోపాటు ఆయన భార్య పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సాక్షులను ఎమ్మెల్సీ బెదిరించారని, వాట్సాప్ కాల్స్ చేసి ప్రలోభపెట్టాలని చూశారని కొన్ని వీడియోలు బయటకు వచ్చాయని చెబుతున్నారు. దీంతో బాధితుడు తరుఫున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది మే 13న అనంతబాబు బెయిలును రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా అనంతబాబు ఉన్నారు. ఈ ఏడాది నవంబరులోగా కేసు విచారణను పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రోజువారి విచారణ జరుగుతున్నట్లు చెబుతున్నారు. మరో నెల రోజుల్లో కేసు విచారణ పూర్తయ్యే అవకాశం ఉండటంతో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిలును పోలీసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీపై డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతోపాటు మరో 19 క్రిమినల్ కేసులు, 2014లో రౌడీషీట్ నమోదు కావడాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళుతూ బెయిలు రాకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు. దీంతో ఎమ్మల్సీ రిమాండ్ ఖైదీగా జైలులోనే ఉండాల్సివస్తోందని అంటున్నారు. ఇక వచ్చేనెలలో కేసు విచారణ కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉండటంతో ఎమ్మెల్సీ భవిష్యత్తుపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.