ఎన్నికల ముందు ఉచితాలా.. అన్నీ పంచేస్తారా? సుప్రీం సూటి ప్రశ్నలు
ఇదంతా రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో జరిగింది. ఇంతకూ ఏమైందంటే..??
By: Tupaki Political Desk | 19 Feb 2026 5:00 PM ISTరాజకీయ పార్టీలు.. ఎన్నికల హామీలు.. లెక్కకు మిక్కిలి ఉచిత పథకాలు..! దేశంలో కొన్నాళ్లుగా నలుగుతున్న చర్చ ఇది. పంచుకుంటూ పోతే పంచె కూడా మిగలదు అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోకుండా ఉచిత పథకాలు అమలు చేస్తుండడం విమర్శలకు తావిచ్చింది. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఎన్నికలకు ముందే ఉచిత పథకాలు ఎందుకు గుర్తుకు వస్తాయంటూ నిలదీసింది. ఇదంతా రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో జరిగింది. ఇంతకూ ఏమైందంటే..??
అందరికీ ఉచిత విద్యుత్తు
ఏప్రిల్ -మే నెలల్లో ఎన్నికలున్న తమిళనాడులో పాలక డీఎంకే ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు పలు తాయిలాలు ప్రకటిస్తోంది. ఇందులోభాగంగా ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామంటూ అక్కడి విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే ఈ ప్రకటన చేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఈ ప్రతిపాదన అమలుపై 2024 నాటి ఎలక్ట్రిసిటీ అమెండ్ మెంట్ రూల్స్ (విద్యుత్ సవరణ నిబంధనలు)ను సవరించాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటిషన్ పై గురువారం చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉచిత హామీలపై మండిపడుతూ.. దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునః సమీక్ష చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆర్థిక స్థితిని పట్టించుకోరా?
తమిళనాడు విద్యుత్ సంస్థ పిటిషన్ విచారణ సమయంలో.. రాష్ట్రాల రెవెన్యూ లోటును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతున్నా ఉచిత స్కీంలు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్రాలతో పాటు దేశాల ప్రగతికీ మంచిది కాదని సుప్రీం పేర్కొంది. ఆహారం, విద్యుత్.. ఇలా అన్నీ ఇస్తూ ఫ్రీగా పోతే ఎలాంటి కల్చర్ ను మనం ప్రోత్సహిస్తున్నట్లు? అని సూటిగా ప్రశ్నించింది. అసలు పూర్తిగా పేదలకు ఉచిత విద్యుత్ అంటే సమంజసం అనుకోవచ్చుగాని.. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అటే అదెలా భావ్యం అని నిలదీసింది.
ఇది బుజ్జగింపు రాజకీయమే...
విద్యుత్ విషయంలో తమిళనాడు నిర్ణయంపై సుప్రీం మరో ఘాటు వ్యాఖ్య కూడా చేసింది. ఎన్నికల ముందు చేసిన ఇలాంటి ప్రతిపాదనలు బుజ్జగింపు రాజకీయమేని అభిప్రాయపడింది. ఇదే సమయంలో కీలక ప్రశ్నలను లేవనెత్తింది. టారిఫ్ లు నోటిఫై చేశాక.. ఉచిత విద్యుత్ ప్రకటన ఎందుకు చేశారంటూ నిలదీసింది. ఎన్నికలకు ముందే ఉచిత పథకాలు తెస్తున్నారని.. అన్నీ పంచుకుంటూ పోతే డెవలప్ మెంట్ ఏంచేస్తారని.. వాటికి డబ్బులు ఎక్కడినుంచి తెస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అభిప్రాయం తమిళనాడు విషయంలో మాత్రమే కాదని.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి అని అభిప్రాయపడింది. ఇలా ఉచితాలకు బదులు.. ఉపాధి కల్పనపై ఫోకస్ పెట్టాలని రాష్ట్రాలకు సూచిస్తూనే సుప్రీం ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
