Begin typing your search above and press return to search.

మైనర్ తో లైంగిక సంబంధం... దోషిగా తేలిన వ్యక్తిని వదిలేసిన సుప్రీం!

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన 24 ఏళ్ల వయసులో 15 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   23 May 2025 3:50 PM IST
మైనర్ తో లైంగిక సంబంధం... దోషిగా తేలిన వ్యక్తిని వదిలేసిన సుప్రీం!
X

దేశ సర్వోన్నత న్యాయస్థానం తన విసృతాధికారాలను ఉపయోగించి సంచలన తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా.. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద 15 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న కేసులో దోషిగా తేలిన వ్యక్తిని విడుదల చేస్తూ.. ఆర్టికల్ 142 కింద తన విస్తృత అధికారాలను ఉపయోగించింది. ఈ విషయం సంచలనంగా మారింది.

అవును... పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన 24 ఏళ్ల వయసులో 15 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం.. ఆమెకు మైనార్టీ తీరాక వివాహం చేసుకున్నాడు. అయితే.. అప్పటికే అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఆ జంట పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది!

ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులో అతడికి పోక్సో చట్టం కింద శిక్షపడింది. దీంతో.. కేసు కోల్ కతా హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 18న కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా... సదరు వ్యక్తికి ఊరటనిస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది! ఇందులో భాగంగా.. బాలికలు తమ లైంగిక కోరికలు అణుచుకోవాలని తెలిపింది!

కేవలం రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారని, కౌమరదశలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంచలను నియంత్రించుకోవాలని సూచించింది. దీంతో.. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారాయి.. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో.. ఈ కేసును సుప్రీం సుమోటాగా తీసుకొంది!

ఈ సందర్భంగా ఆగస్టు 20, 2024న కోల్ కతా హైకోర్టు తీర్పును పక్కనపెట్టి.. ఆ వ్యక్తికి శిక్షను తిరిగి ఖరారు చేసింది. ఈ సమయంలో... అతడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆమె మానసిక పరిస్థితి పరిశీలన కోసం నిపుణులతో ఒక కమిటీని వేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ లో బాధితురాలితో సుప్రీంకోర్టు మాట్లాడింది.

ఈ సందర్భంగా... ఆమె పదోతరగతి పరీక్షలు రాసిన తర్వాత ఆమెకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలో తాజాగా ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా తనకున్న విస్తృత అధికారాన్ని ఉపయోగించింది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... చట్టప్రకారం ఆ ఘటనను నేరంగానే చూస్తున్నప్పటికీ.. ప్రస్తుతం మేజర్ అయిన ఆమె దానిని అలా చూడటం లేదని.. ఆ ఘటన వల్ల ఆమెపై మానసికంగా ఎలాంటి ప్రభావం పడనప్పటికీ.. కొన్ని ఇబ్బందికర పరిణామాలను మాత్రం ఎదుర్కొందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలో.. ప్రస్తుతం దోషి, కుటుంబ జీవితంతో ఆమెకు ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో.. ఆమెకు పూర్తిగా న్యాయం చేయడానికి విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నామని చెప్పింది. దీంతో.. పోక్సో కేసులో దోషికి ఏ శిక్షా విధించకుండా తీర్పు ఇస్తున్నట్లు వెల్లడించింది.