నాగరాజు వ్యవహారం అత్యంత దారుణం: సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్
సోమవారం రాత్రి 11 గంటల తర్వాత.. వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
By: Garuda Media | 28 July 2026 4:19 PM ISTవిజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక అప్పటి సీఐ నాగరాజు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ రిలీఫ్ ఇచ్చింది. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత.. వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. కాగా.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజును విజయవాడలోనే విచారించాలని ఆదేశించింది. అంతేకాదు.. వీడియో, ఆడియో రికార్డింగులు కూడా చేయాలని పేర్కొంది.
గతంలో ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును, విజయవాడలోని సీఐడీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. నాగరాజు వ్యవహారం అత్యంత దారుణమని వ్యాఖ్యానించిన కోర్టు.. ఈ కేసును సమగ్రంగా విచారించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ''ఇది నామమాత్రంగానో.. కంటి తుడుపుగానో విచారించే కేసు కాదు. కోర్టులను పక్కదారి పట్టించిన ఓ పోలీసు కథ. ఓ వ్యక్తిని విచారణ పేరుతో తీసుకువచ్చి మాయం చేసిన కథ'' అంటూ.. తనదైన శైలిలో వ్యాఖ్యానించినట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కేసు వ్యవహారాన్ని ఘటన జరిగిన చోటే విచారించాలన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించింది.
మొత్తంగా ప్రభుత్వం తరఫున(సీఐడీ సిట్) నాగరాజును తమ కస్టడీకి 10 రోజులు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే.. సుప్రీంకోర్టు మాత్రం ఏడు రోజులు మాత్రమే అప్పగించింది. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని రికార్డులు భద్ర పరచాలని.. డిలీట్ చేయడం, చెరిపేయడం వంటివి చేస్తే.. చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో నాగరాజు వ్యవహారం కీలక దశకు చేరుకుందని సీఐడీ సిట్ అధికారులు చెబుతున్నారు. సుప్రీం ఆదేశాల ఉత్తర్వులు అందగానే.. రాజమండ్రి జైలు నుంచి నాగరాజును తీసుకువచ్చి విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లోనే విచారించనున్నారు.
ఏం జరిగింది?
సాయికృష్ణ అనే వ్యక్తిపై రౌడీ షీట్ ఉంది. దీంతో ఓ వ్యక్తి హత్యకేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. అయితే.. ఇతర కేసుల్లో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు ఇచ్చింది. దీంతో మార్కాపురంలో తలదాచుకున్న సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని తీసుకువచ్చి కృష్ణలంక పోలీసు స్టేషన్ అప్పటి సీఐ నాగరాజుకు అప్పగించారు. అనంతరం.. కొన్నాళ్లకు సాయికృష్ణ అదృశ్యమయ్యాడని.. ఆరోపిస్తూ.. ఆయన తల్లి విజయలక్ష్మి మీడియా ముందుకు రావడం.. అనంతరం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారంపెను సంచలనంగా మారింది.
ఈ క్రమంలో సాయికృష్ణ ఏమయ్యాడన్న వ్యవహారంపై తేల్చేందుకు ప్రభుత్వం సీఐడీ సిట్‌ను ఏర్పాటుచేసింది. ప్రాథమిక విచారణలో సాయికృష్ణ లాకప్‌డెత్ అయ్యాడని సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే సీఐ నాగరాజును అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే.. శవాన్ని ఏం చేశారు? అనే కోణంలో నాగరాజును విచారించాలన్నది సిట్ ఆలోచన. ఈ క్రమంలోనే విజయవాడకు తీసుకురావాలని భావించారు. కానీ, తనను రాజమండ్రిలోనే విచారించాలని నాగరాజు పట్టుబట్టాడు. మొత్తంగా సుప్రీంకోర్టు తుది తీర్పుతో .. నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లోనే(అతను పనిచేసిన చోట) విచారించనున్నారు.
