విడాకుల కేసుల్లో సీక్రెట్ ఫోన్ రికార్డింగ్‌లు సాక్ష్యాలే!
భార్యాభర్తల విడాకుల కేసులలో సీక్రెట్ ఫోన్ రికార్డింగ్‌లు సాక్ష్యాలుగా పరిగణించబడతాయని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By: Tupaki Desk | 14 July 2025 4:36 PM ISTభార్యాభర్తల విడాకుల కేసులలో సీక్రెట్ ఫోన్ రికార్డింగ్‌లు సాక్ష్యాలుగా పరిగణించబడతాయని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు, పంజాబ్‌కు చెందిన ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించింది. భార్యాభర్తల మధ్య విభేదాలు, విడాకుల కేసులలో సీక్రెట్ ఫోన్ రికార్డింగ్‌లు సాక్ష్యాలుగా చెల్లుతాయని సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక విడాకుల కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. "భార్యాభర్తల మధ్య ఫోన్ సంభాషణలకు సంబంధించిన సీక్రెట్ రికార్డింగ్‌లను సాక్ష్యాలుగా పరిగణించవచ్చు" అని కోర్టు స్పష్టం చేసింది.
- అసలు కేసు ఏమిటి?
పంజాబ్‌లోని బఠిండా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తించిందని ఆరోపిస్తూ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలను రుజువు చేయడానికి, తన భార్యతో తాను చేసిన ఫోన్ సంభాషణలను రికార్డు చేసి, ఆ రికార్డింగ్‌లను కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించారు. ఈ రికార్డింగ్‌లను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విచారణను ప్రారంభించింది. అయితే భార్య ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తన సమ్మతి లేకుండా సంభాషణలు రికార్డు చేయడం తన గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని వాదించింది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆమె పంజాబ్ & హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆమె వాదనను సమర్థిస్తూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను రద్దు చేసింది.
- సుప్రీం ధర్మాసనం తీర్పు
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "భార్యాభర్తల మధ్య పరస్పర నమ్మకానికి లోటు ఏర్పడినప్పుడు, వారు ఒకరిపై ఒకరు నిఘా పెట్టే స్థితికి వస్తే, ఆ సంబంధం బలహీనంగా మారిందన్నదానికి ఇది నిదర్శనం. ఇలాంటి సందర్భాల్లో సీక్రెట్ రికార్డింగ్‌లను తగిన పద్ధతిలో సాక్ష్యాలుగా పరిగణించొచ్చు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదని మేము భావిస్తున్నాం" అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పాటు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఫ్యామిలీ కోర్టు తిరిగి విచారణ కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
-న్యాయపరంగా దీని ప్రాముఖ్యత
ఈ తీర్పు భారతీయ కుటుంబ చట్టాల పరిధిలో "గోప్యత" , "సత్య నిర్ధారణ" మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను సూచిస్తుంది. దంపతుల మధ్య బలహీనమైన సంబంధాన్ని రికార్డింగ్‌ల ఆధారంగా నిరూపించవచ్చని, వాటిని పక్కనపెట్టడం న్యాయసమ్మతం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత గోప్యత కంటే కేసులో నిజానిజాలు తెలుసుకోవడం ముఖ్యం అనే అంశానికి ప్రాధాన్యతనిచ్చింది.
ఈ తీర్పు భవిష్యత్తులో విడాకుల కేసులలో ముఖ్యంగా మానసిక వేదన, క్రూరత్వం వంటి ఆరోపణలకు సంబంధించి, టెక్నాలజీ ఆధారిత సాక్ష్యాల ప్రాముఖ్యతను పెంచే అవకాశం ఉంది. అయితే, ఇదే సమయంలో వ్యక్తిగత గోప్యత పరిరక్షణపై చర్చను కూడా మరింత ఉత్కంఠతరంగా మార్చనుంది. ఈ తీర్పుతో విడాకుల కేసుల విచారణలో కొత్త కోణం ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇటువంటి సాక్ష్యాల వినియోగంపై మరిన్ని మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.
